బంగారం, క్రూడాయిల్ పరుగో పరుగు.. కారణమేంటంటే?

బంగారం, క్రూడాయిల్ పరుగో పరుగు..  కారణమేంటంటే?

కొవిడ్-19 ప్రభావంతో కమాడిటీ మార్కెట్ రయ్‌మంటూ దూసుకుపోతోంది. ఒక దశలో భారీగా పతనమైన క్రూడాయిల్ఇప్పుడు అప్‌ట్రెండ్‌లో ఉండగా.. మరోవైపు గోల్డ్, బేస్‌మెటల్స్ కూడా ధరలు పెరుగుతున్నాయి. ఇక బంగారం మార్కెట్ అయితే చరిత్రలో కనీవినీ ఎరుగని స్పీడ్‌తో పరుగులు పెడుతోంది.

కరోనావైరస్‌కు వ్యాక్సీన్ రానుందనే ఆశలు క్రమంగా పెరుగుతున్నాయి. అనేక దేశాలలో, ముఖ్యంగా యూరోప్ కంట్రీస్‌లో లాక్‌డౌన్ సడలింపులు, తొలగింపులు వేగంగా ఉన్నాయి. అలాగే ఆర్థిక కార్యకలాపాలు కూడా ఊపందుకుంటున్నాయి. మన దేశంలో కూడా తాజాగా లాక్‌డౌన్ 4.0 విషయంలో అనేక సడలింపులు ఇచ్చి.. కంటైన్‌మెంట్ జోన్స్ మినహా మిగిలిన ప్రాంతాలలో దాదాపుగా సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఇప్పుడు ఖచ్చితం కావడంతో.. ప్రీషియస్ మెటల్స్, బేస్ మెటల్స్, కమాడిటీల ధరలు పెరుగుతున్నాయి.

గత కొన్ని నెలలుగా ఎలాంటి డిమాండ్ లేక భారీగా పతనం అయిన ధరలు.. ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. కేవలం ఒక నెలలోనే రికార్డు కనిష్ట స్థాయి నుంచి క్రూడాయిల్ ధర కోలుకుంది. ఒక దశలో 20 డాల్రలకు పతనమైన క్రూడ్.. ఇప్పుడు మళ్లీ 35 డాలర్లకు చేరువలో ఉంది. మరోవైపు ఒపెక్ ప్లస్ దేశాలు ఉత్పత్తిని తగ్గించుకోవాలని నిర్ణయించడం కూడా క్రూడ్ రేట్లకు సపోర్ట్ ఇస్తోంది. ఇక ఆర్థిక కార్యకలాపాలు పెరగడం అంటే.. మొదటగా డిమాండ్ క్రూడాయిల్‌కే ఉంటుంది. ఇప్పుడు కొవిడ్-19 లాక్‌డౌన్ ముందు స్థాయికి ఇంకా డిమాండ్ చేరలేదు కానీ.. క్రమంగా గిరాకీ పుంజుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.

బంగారంపై అయితే మన మార్కెట్లో డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇంతకాలం ఫిజికల్ మార్కెట్ పూర్తిగా మూతపడిపోయినా.. డిజిటల్ గోల్డ్ వైపు ఇన్వెస్టర్‌లు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా గోల్డ్‌ను పరిగణిస్తుండడంతో.. బంగారం ధర ఔన్సుకు 1700 డాలర్లు దాటిపోయింది. ఈ వారంలో అయితే ఏకంగా 1730 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. గ్లోబల్‌గా ఆర్థిక వ్యవస్థలు మరికొంత ఊపందుకుంటే బంగారం రేటు 1800 డాలర్లకు చేరే అవకాశముందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో మన రూపాయి మారకం కూడా భారీగా పతనం కావడం.. పసిడి రేట్లకు రెక్కలు ఇచ్చింది.

చాలాకాలం పాటు డాలరుకు 72 రూపాయల వద్ద కొనసాగిన రూపాయి మారకం ఇప్పుడు 76కు చేరువలో ఉంది. డాలర్‌కు డిమాండ్ ఊపందుకోవడం కూడా.. మన దేశంలో పుత్తడి రేట్లు పెరిగేలా చేస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ ధర 46వేల500 స్థాయిలో ఉండగా.. అతి త్వరలోనే ప్యూర్ గోల్డ్ ప్రైస్ 50వేలకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదనే అంచనాలు వినిపిస్తున్నాయి.