చైనా కంపెనీలను అమెరికా ఎందుకు డీలిస్ట్‌ చేస్తుందంటే..?

చైనా కంపెనీలను అమెరికా ఎందుకు డీలిస్ట్‌ చేస్తుందంటే..?

చైనాపై అమెరికా గుర్రుమంటూనే ఉంది. టారిఫ్ వార్‌తోనే ఈ రెండు దేశాల కీచులాటలు అధిక స్థాయిలో ఉండగా.. ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందంటూ.. చైనా వైరస్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చైనా కంపెనీలను డీలిస్ట్ చేసేందుకు కూడా అమెరికా సిద్ధమైపోతోంది.

అమెరికా మార్కెట్లలో చైనా కంపెనీలను డీలిస్ట్ చేసేందుకు.. యునైటెడ్ స్టేట్స్ సిద్ధమవుతోంది. ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్స్, బైదు వంటి చైనా కంపెనీలను యూఎస్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లను పంపేయాలని నిర్ణయం తీసుకోగా.. ఇప్పటికే దీనికి సెనేట్ నుంచి ఆమోదం లభించడం గమనించాలి. ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతున్న పోరాటం కావడంతో.. ఈ పరిణామాలను అన్ని దేశాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

సెనేటర్ జాన్ కెనడీ ప్రతిపాదించిన ఈ బిల్‌కు.. ఏకగ్రీవంగా ఆమోదం లభించడం విశేషం. తాము ఇతర దేశాల ప్రభుత్వాల నియంత్రణలో ఉండబోమని... అమెరికన్ లీడర్స్ చెబుతున్నారు. చైనాకు చెందిన అతి పెద్ద కంపెనీలలోకి బిలియన్‌ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేయడాన్ని కూడా యూఎస్ లామేకర్స్ అడ్డుకున్నారు. తమ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు సృష్టించిన సంపద.. ఇతర దేశాలకు తరలిపోవడం సహించబోమని చెబుతున్నారు. ఈ ప్రభావంతో అమెరికా మార్కెట్లు ఊపందుకుంటున్నా చైనా స్టాక్స్ మాత్రం నష్టాలకు గురవుతున్నాయి.

ప్రస్తుత పరిణామాలను కోల్డ్ వార్ గానే పరిగణించాలని ఆర్థికవేత్తలు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల విషయంలో చేసుకున్న ఒప్పందాలు ఇప్పుడు పునర్ నిర్వచించాల్సి వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మన దేశంపై ఇలాంటి ఆంక్షలు లేకపోయినా.. భవిష్యత్‌లో ఈ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అంటున్నారు.