వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులకు ఊరట

వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులకు ఊరట

వేతన జీవులు, ప్రత్యక్ష పన్ను చెల్లింపు దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద వారికి ఊరట కల్పించింది. TDS, TCS రేట్లు 25 శాతం మేర తగ్గించింది. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువునూ  నవంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

కరోనా విజృంభనతో వివిధ సంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయి. ప్రభుత్వం, ప్రైవేటు తేడా లేకుండా ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమయానికి జీతాలు రాక కొందరు, సగం జీతాలతోనే మరికొందరు నెట్టుకొచ్చారు. అసలే జీతాలు అరకొరగా వస్తున్న సమయంలో ఈపీఎఫ్‌లు అంటూ కటింగులు పెడితే చేతికి వచ్చే ఆ కాస్త మొత్తం కూడా తగ్గిపోతుంది. అందుకే ఉద్యోగులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది కేంద్రం. 

EPF కాంట్రిబ్యూషన్‌ను 3 నెలల పాటు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 6 వేల 750 కోట్లు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. ఉద్యోగులు మరింత ఎక్కువ వేతనం అందేలా చూడటం, పీఎఫ్ బకాయిల చెల్లింపులో యాజమాన్యాలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 6.5 లక్షల సంస్థలు, 4.3 కోట్ల ఉద్యోగులకు  ఉపశమనం కలుగనుంది. అయితే పీఎం గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద 24 శాతం EPF సపోర్ట్‌ ఉన్న వర్కర్లకు మాత్రం ఈ స్కీమ్ వర్తించదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

ప్రత్యక్ష పన్ను చెల్లింపు దారులకూ కేంద్రం శుభవార్త చెప్పింది. అన్ని శ్లాబులపై ఉన్న టీడీఎస్, టీసీఎస్‌ రేట్లు 25 శాతం మేర తగ్గించింది. గురువారం నుంచి 2021 మార్చి 31వరకు ఈ తగ్గింపు అమల్లో ఉంటుంది. ఈ వెసులుబాటు వల్ల ప్రజలకు సుమారు 50 వేల కోట్ల రూపాయల ప్రయోజనం కలుగుతుంది. ప్రొఫెషనల్ ఫీజు, బ్యాంకు వడ్డీ, ఇంటి అద్దె, డివిడెండ్, కమీషన్ వంటివి కూడా తగ్గించిన TDSకి వర్తిస్తాయని నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు.

చారిటబుల్ ట్రస్టులు,స్వచ్చంధ సంస్థలు, సహకార సంఘాలకు.. పెండింగ్ రీ ఫండ్స్ సత్వరమే చెల్లిస్తామని ప్రకటించింది కేంద్రం. అలాగే 2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్  దాఖలు చేయడానికి నవంబర్ 30 వరకు గడువు పొడిగించింది. గతంలో జూలై 30 నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇప్పుడా గడువుని నవంబర్ 30కి పెంచారు.

కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో దాదాపు కేటాయింపులన్నీ పరోక్ష పద్ధితిలో చేసినవే. రంగాలవారీగా  నిధులు సమకూర్చారు. అయితే EPF కాంట్రిబ్యూషన్ తగ్గించడం, టీడీఎస్, టీసీఎస్‌ రేట్ల కోత వంటి నిర్ణయాలతో వేతన జీవులకు ప్రత్యక్షంగా కొంతలో కొంత రిలీఫ్ లభించిందని చెప్పొచ్చు.