ఆర్థిక ప్యాకేజీలో ఏ రంగానికి ఎంతెంత?

ఆర్థిక ప్యాకేజీలో ఏ రంగానికి ఎంతెంత?

MSMEలపై వరాల జల్లు! లోకల్ బ్రాండ్‌కు ప్రమోషన్! వేతన జీవులకు ఊరట!  విద్యుత్ రంగానికి నూతన ఉత్తేజం!   నాన్ బ్యాకింగ్ సెక్టార్‌కు ఊతం. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చేయూత! ఇదీ స్థూలంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేసిన కేటాయింపులు. కరోనా కాటుతో కుదేలైన ఆర్థిక రంగానికి ఊపిరిలూదేందుకు ప్రధాని ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని వివిధ సెక్టార్లకు సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. మొత్తం ప్యాకేజీని 15 అంశాలుగా విభజించి కేటాయింపులు జరిపారు. స్వయం ఆధారిత భారతం లక్ష్యమన్నారు.

కరోనా దెబ్బకు పట్టాలు తప్పిన దేశ ఆర్థిక రంగాన్ని తిరిగి గాడిన పెడ్డటమే లక్ష్యంగా 20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో ప్రకటించిన ఈ మొత్తంపై దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూసింది. 20 లక్షల కోట్లను ఎలా సర్దుబాటు చేస్తారన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వివిధ రంగాలకు చేసిన కేటాయింపులను ఒక్కొక్కటిగా వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటే స్వయం ఆధారిత భారతం అన్న ఆమె.. ఈ నినాదం దేశ ప్రజలకు కొత్త ఉత్తేజం ఇస్తుందని చెప్పారు. 5 మూల సూత్రాల ఆధారంగా ప్యాకేజీ ప్రకటించామన్నారు. లోకల్ బ్రాండ్ కు అంతర్జాతీయ స్థాయి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో MSMEలకు పెద్దపీట వేశారు. వరాల జల్లు కురిపించారు. మొత్తం 3 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం ఆరు అంశాల్లో భారీ ప్రయోజనాలు కల్పించారు. ఆర్థిక కష్టాలతో కొట్టిమిట్టాడుతోన్న విద్యుత్ డిస్కమ్ లకు కొత్త ఊపిరులూదే ప్రయత్నం చేసింది కేంద్రం. నగదు లభ్యత కొరత రాకుండా 90 వేల కోట్లు కేటాయించింది. ఈ మేరకు పొందిన ప్రయోజనాలను డిస్కంలు వినియోగదారులకు కూడా బదిలీ చేయాలని సూచించారు ఆర్థిక మంత్రి. నాన్ బ్యాకింగ్ పవర్ సెక్టార్స్‌కు కూడా చేయూత నిచ్చింది కేంద్రం. 30 వేల కోట్లతో స్పెషల్  లిక్విడిటీ స్కీమ్ ను ప్రకటించింది. అలాగే పార్షియల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద మరో 45 వేల కోట్లు అందుబాటులో ఉంచనున్నారు.

కొవిడ్‌ సమయాన్ని యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌గా చూడాలన్నారు నిర్మలా. కాంట్రాక్టు పనులు పూర్తి చేసేందుకు 6 నెలల వరకు వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపారు..కేంద్ర ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల.. బ్యాంకు గ్యారంటీలను పాక్షికంగా విడుదల చేస్తామన్నారు. ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. మరో మూడు నెలలపాటు కంట్రిబ్యూషన్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే  ప్రస్తుతం ఉన్న TDS, TCS రేట్లు 25% తగ్గించింది. ఇన్ కం టాక్స్ రిటర్స్ గడువును  కూడా నవంబర్ 30 వరకు పొడిగించారు.

అయితే దేశానికి వెన్నముకగా చెప్పుకునే వ్యవసాయం, రైతుల గురించి ఈ ప్యాకేజీలో ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అలాగే హోమ్, వెహికిల్, పర్సనల్ లోన్స్ మారటోరియం మరో 3 నెలలపాటు చెల్లించాలంటూ వివిధ వర్గాల పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీనిపైనా ఎలాంటి ప్రకటనా  చేయకపోవడం మధ్యతరగతి ప్రజలను నిరాశ పరిచింది.