MSME రంగానికి నిర్మలమ్మ వరాలు..

MSME రంగానికి నిర్మలమ్మ వరాలు..

ఊహించినట్లే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో MSMEలకు పెద్దపీట వేసింది కేంద్రం. వరాల జల్లు కురిపించింది. ఉత్పత్తి , ఉద్యోగ భద్రతకు ఢోకా ఉండదంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. ఏకంగా 3 లక్షల కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక ప్యాకేజీతో MSMEలకు మొత్తం ఆరు అంశాల్లో ప్రయోజనాలు కలుగుతాయి.

కరోనా దెబ్బకు దేశంలోని అన్ని రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. ఎలాంటి ఆదాయమార్గాలు లేకపోవడంతో పూర్తిగా కుదేలయ్యాయి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి పూర్తిగా దిగజారింది. కొన్ని సంస్థలు మూతపడే దశకు చేరుకున్నాయి. మరికొన్ని సంస్థలు ఖర్చును భారీగా తగ్గించుకున్నాయి. దీంతో చాలా మంది కార్మికులు ఉద్యోగాలకు ఎసరొచ్చింది. దీంతో గరీబ్ కళ్యాణ్ పేరుతో గతంలో లక్ష 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. అయితే దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రం కావడం, వివిధ రంగాల నుంచి వచ్చిన ఒత్తిళ్లు, రాష్ట్రాల డిమాండ్లతో ఈసారి 20 లక్షల కోట్లతో మరో భారీ ప్యాకేజీ తెచ్చింది. ఇది దేశ జీడీపీలో దాదాపు 10 శాతానికి సమానం.  

దేశంలో దాదాపు 6.5 కోట్ల MSMEలు ఉన్నాయి. భారత జీడీపీలో వీటి వాటా దాదాపు 29 శాతం. దేశీయ ఎగుమతుల్లో 48 శాతం. దాదాపు 11 కోట్ల మందికి MSMEలు ఉపాధి కల్పిస్తున్నాయి. కరోనా సంక్షోభం తీవ్రంగా ప్రభావితమైన ఈ సంస్థలను ఆదుకునేందుకు తాజా ప్యాకేజీలో అధిక ప్రాధాన్యం ఇచ్చింది కేంద్రం. మొత్తం 3 లక్షల కోట్లు కేటాయించారు. పూచీకత్తు లేకుండా, 12 నెలల మారటోరియంతో రుణాలు ఇస్తామని ప్రకటించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ ప్యాకేజీతో MSMEలకు మొత్తం ఆరు అంశాల్లో ప్రయోజనాలు కలుగుతాయి. తక్షణం ఉత్పత్తి ప్రారంభించడంతోపాటు.. కార్మికుల ఉద్యోగ భద్రతకు దోహదపడుతుంది.

MSMEల్లో ఈక్విటీ పెట్టుబడుల కోసం 50వేల కోట్లు కేటాయిస్తున్నామని నిర్మలా తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపు కోసం 10 వేల కోట్లతో ఫండ్‌ ఆఫ్ ఫండ్స్‌‌ను ప్రకటించారు. శక్తి, సామర్థ్యం ఉన్న ఏ MSMEలైనా ఈ సదుపాయం ఉపయోగించుకోవచ్చు.

MSMEల నిర్వచనం గురించి కొంత అయోమయం ఉందన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. ఇప్పుడు వాటికి మేలు చేసేలా కొత్త నిర్వచనం ఇస్తున్నామని ప్రకటించారు. MSMEల పెట్టుబడి పరిమితిని గణనీయంగా పెంచారు. పెద్దమొత్తంలో పెట్టుబడులు వచ్చినా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పరిధిలోనే ఉంటాయి. 200 కోట్లలోపు కొనుగోళ్లకు గ్లోబల్‌ టెండర్లకు అవకాశం లేదని ఆర్థిక మంత్రి చెప్పారు. 

20 లక్షల కోట్ల ప్యాకేజీలో 3 లక్షల కోట్లు కేటాయించడం ద్వారా MSMEలు దేశ ఆర్థికరంగానికి ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పింది కేంద్రం. ఆర్థిక సమస్యలతో కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రలకు ఇదో పెద్ద ఊరట. పెద్ద ఎత్తున రుణాలు లభ్యమయ్యే అవకాశం ఉండటంతో..MSMEలు త్వరలోనే గాడిన పడే అవకాశం ఉంది..