ఇండిగోలో అమ్మకాల ఒత్తిడి

ఇండిగోలో అమ్మకాల ఒత్తిడి

దేశీయ విమాన కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఇవాళ ఇంటర్‌గ్లోబల్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌(ఇండిగో) అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 8 శాతం నష్టంతో రూ.844కు పడిపోయింది. ఆ తర్వాత కోలుకున్పప్పటికీ ఇండిగో ఇంకా నష్టాల్లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండిగో 4 శాతం పైగా నష్టంతో రూ.882 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో షేర్‌ రూ.901  గరిష్ట స్థాయికి చేరింది. ఉదయం 9:45 నిమిషాల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి 2.70 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.35,366.63 కోట్లు, పీ/ఈ 29.03, బుక్‌ వాల్యూ రూ.179.28, ఈపీఎస్‌ 31.57గా ఉంది.

ఈనెల 31 వరకు సర్వీసులను నిలిపివేసినప్పటికీ.... ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోత విధించబోమని ఇండిగో ప్రకటించింది. ఉద్యోగుల్లో ఉన్న అయోమయాన్ని నివృత్తి చేస్తూ సెలవుల్లో కూడా ఎలాంటి కోత విధించబోమని ఇండిగో హామీ ఇచ్చింది. వచ్చేనెల్లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మెరుగ్గానే ఉన్నాయని, సర్వీసులు తగ్గినప్పటికీ ఏప్రిల్‌ మళ్ళీ సర్వీసులను పునరుద్ధరించే యోచనలో ఉన్నామని తెలిపింది. ప్రభుత్వ ఆదేశానుసారం తాము నిర్ణయం తీసుకుంటామని, కరోనాపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది. వచ్చే కొన్ని వారాల్లో వ్యయం కంటే ఆదాయం తక్కువగా ఉండొచ్చని, దీన్ని ఎదుర్కొనేందుకు  తాము తగిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్టు ఇండిగో అధికార వర్గాలు తెలిపాయి.