వీటిపై నిషేధం.. ఆ స్టాక్స్‌పై ప్రభావం ఇలా!

వీటిపై నిషేధం.. ఆ స్టాక్స్‌పై ప్రభావం ఇలా!

కరోనా వైరస్ భయాలతో ప్రజలు కొన్ని రకాల ఔషధాలను విపరీతంగా కొనుగోలు చేసి ఇంట్లో స్టాక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిథ్రోమైసిన్ ఔషధాలకు విపరీతంగా గిరాకీ ఏర్పడి.. బయటెక్కడా స్టాక్ లభించని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వీటిని పలు కంపెనీలు విదేశాలకు ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తుంటాయి.

కానీ దేశవ్యాప్తంగా  కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతుండడంతో.. హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిథ్రోమైసిన్‌ల ఎగుమతులపై కేంద్రం బ్యాన్ విధించింది. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయాలు చేస్తే చర్యలు చేపడతామని కెమిస్ట్‌లకు హెచ్చరికలు జారీ చేసింది.

డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940 ప్రకారం ఈ ఔషధాల విక్రయాలపై నిబంధనలు పాటించాల్సిందిగా కెమిస్ట్‌లు/డ్రగ్గిస్ట్‌లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ప్రస్తుతం హ్యాండ్ శానిటైజర్‌ల విషయంలో కూడా ఎక్స్‌పోర్ట్ బ్యాన్‌ను కేంద్రం ప్రకటించింది. ఎట్టి పరిస్థితులలోనూ శానిటైజర్స్‌ను ఎగుమతి చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సిప్లాతో పాటు పలు దేశీయ ఔషధ కంపెనీలు తయారు చేస్తున్నాయి. మలేరియా చికిత్సలో భాగంగా ఉపయోగించే ఈ ఔషధానికి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం డిమాండ్ నెలకొన్న పరిస్థితులలో ఎగుమతులు నిషేధం విధించడం ఆయా కంపెనీల లాభాలపై ప్రభావం చూపే అంశమే. అయితే.. దేశీయంగా నెలకొన్న డిమాండ్‌ను బేస్ చేసుకుని వీటిని ఎక్స్‌పోర్ట్స్‌కు అనుమతించడం  ప్రస్తుతం సాధ్యమయ్యే అంశం కాదు.

మరోవైపు శానిటైజర్స్‌ తయారీలో ఐటీసీ, గోద్రెజ్ వంటి కంపెనీలు నిమగ్నమయ్యాయి. వీటి ఎగుమతి కూడా చేస్తుంటాయి. ఇప్పుడు శాటినైటర్స్‌పై కూడా ఎక్స్‌పోర్ట్ బ్యాన్ విధించడం కొంతమేర లాభదాయకతపై ప్రభావం చూపినా... ప్రస్తుతం దేశంలో నెలకొన్న డిమాండ్ నేపథ్యంలో.. వీటి విక్రయాలు ఇక్కడే జోరుగా కొనసాగే అవకాశం ఉంది. కానీ శానిటైజర్స్ ధరపై గరిష్ట పరిమితి విధిస్తూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం ప్రకటించడం.. ఈ కంపెనీలకు పరిమిత లాభాలను మాత్రమే అందించనుంది.