స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు మూసేస్తే పతనం ఆగుతుందా?

స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు మూసేస్తే పతనం ఆగుతుందా?

కరోనా వైరస్ దాడి మొదలైనప్పటి నుంచి దేశీయ మార్కెట్లు కూడా ప్రపంచ మార్కెట్ల బాటలోనే ఉన్నాయి. తాజా గరిష్ట స్థాయిల నుంచి పోల్చితే దాదాపు 40 శాతం మేర బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు పడిపోయాయి. సెక్టోరియల్ సూచీలలో ఈ పతనం ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. ఫైనాన్షియల్ సెక్టార్ రంగం.. ఆ సెక్టార్‌కు చెందిన స్టాక్స్ అయితే దారుణంగా పడిపోయాయి. కొన్ని స్టాక్స్ ఏళ్ల తరబడి లోయర్ లెవెల్స్‌లో ఉంటే.. మరికొన్ని స్టాక్స్ దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఈ పతనాన్ని అడ్డుకోవడానికి, మార్కెట్లలో ఓలటాలిటీని ఆపేందుకు.. షార్ట్ సెల్లింగ్ నియంత్రణపై సెబీ చేపట్టిన చర్యలను కూడా మార్కెట్ పట్టించుకోవడం లేదు.

 

సెబీ యాక్టివిటీస్ పని చేయలేదుగా

షార్ట్ సెల్లింగ్‌ను అరికెట్టేందుకు తాజాగా సెబీ అనేక చర్యలను ప్రకటించింది. ఎన్ని రకాల ఆంక్షలను నిర్దేశించినా మార్కెట్ల పతనం ఆగకపోవడంతో.. ఇప్పుడు ఈ పతనాన్ని అడ్డుకోవడానికి ఒకే ఒక మార్గం.. తాత్కాలికంగా స్టాక్ మార్కెట్లను కొన్ని రోజుల పాటు మూసివేయడమే మార్గంగా కొందరు చెబుతున్నారు. అయితే, ఇలాంటి చర్యలు చేపట్టే ముందు గతంలో ఇలా మార్కెట్లను మూసివేసిన ఇతర దేశాల్లో గత కాలపు పరిస్థితులను బేరీజు వేసుకోవాలని అంటున్నారు. 2012లో ఫిలిప్పైన్స్ మార్కెట్‌ భారీగా పతనం అవుతుండడంతో.. రెండు రోజుల పాటు కూల్‌డౌన్ పరిస్థితుల కోసం మూసి వేశారు. అయితే.. స్టాక్ మార్కెట్లను తిరిగి ప్రారంభించిన రెండు రోజులలోనే అక్కడి ఇండెక్స్‌లు 37 శాతం పతనం అవడంతో.. ఇన్వెస్టర్ల సంపద దారుణంగా క్షీణించింది.

 

గతంలో ఏం జరిగిందంటే

ఫిలిప్పైన్స్‌లో ఇలాంటి పరిస్థితి కారణం... ఆ దేశ అధికారులు మార్కెట్స్‌ను నియంత్రించుకోవడం కోసం చర్యలు చేపట్టిన తరువాత అమెరికాలో ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ 19 శాతం క్షీణించాయి. మార్కెట్లను షట్‌డౌన్ చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే పానిక్ సిట్యుయేషన్స్ తలెత్తుతాయో.. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌ఐఐలు తమ పెట్టుబడులను పలు దేశాలలో ఉపసంహరించుకుని.. నష్టాలను తగ్గించుకుంటారు. కానీ స్థానిక ఇన్వెస్టర్లు ట్రేడర్లు మాత్రం ఆ అవకాశం లేక దారుణంగా నష్టపోవాల్సి ఉంటుంది.

 

స్మార్ట్ ఇన్వెస్టర్లకు హాని

ప్రైస్ డిస్కవరీ కోసమే మార్కెట్లలో లావాదేవీలకు అనుమతిస్తూ ఉంటారు. ఓ వర్గం పార్టిసిపెంట్స్‌ను రక్షించాలనే ట్రేడింగ్ జరగదు. సొమ్ములను పూర్తి స్థాయిలో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్‌కు ఇది భయానక పరిస్థితి అయితే.. కొనుగోళ్ల కోసం ఎదురుచూసే ఇన్వెస్టర్‌కు ఇది అనుకూలమైన సమయంగా పరిగణిస్తారు. ఇలాంటి సమయంలోనే వారెన్ బఫెట్ చెప్పిన సూత్రాన్ని గుర్తు చేసుకోవాలి. ఇతర ఇన్వెస్టర్లు భయపడుతున్న సమయంలో మార్కెట్లలో స్వార్ధం ప్రదర్శించాలన్నది ఆయన ప్రధాన సూత్రాలలో ఒకటి. ఇలా మార్కెట్లు పతనం సమయంలో ఉన్నప్పుడు కొనుగోలు చేయాలని ఆశించే స్మార్ట్ ఇన్వెస్టర్‌లకు... మార్కెట్లను మూసివేయడం అంటే.. అలా తక్కువ ధరలలో కొనుగోలు చేసే అవకాశాన్ని లేకుండా చేయడమే.

 

సిప్ చేసేవారికి అధిక యూనిట్లు
అదే విధంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్‌లు కూడా ఫండ్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ యూనిట్స్‌ను కొనుగోలు చేయాలని భావిస్తారు. సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసేవారికి కూడా కరెక్షన్ సమయంలో ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. మార్కెట్లు ఏ స్థితిలో ఉన్నా కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌లో వీరు ఇన్వెస్ట్ చేయడం ఆపరు. ఎలాంటి ఫండమెంటల్స్ లేకుండానే.. కొన్ని స్టాక్స్ భారీగా పెరిగిపోవడం కూడా మార్కెట్లలో గమనిస్తూ ఉంటాం. అలాంటి సమయంలో ట్రేడింగ్ పై బ్యాన్ విధించనప్పుడు.. పతనం సమయంలో మాత్రం ఈక్విటీలలో బ్యాన్ ఎందుకు చేయాలనే వాదన కూడా ఉంది.

మూసేస్తే పరిస్థితేంటి?
మార్కెట్లను మూసివేయడం మంచి కంటే చెడే ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లలో భయాందోళనలు నిండిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా బ్యాంక్ స్టాక్‌లో ట్రేడింగ్ నిలిపివేస్తే.. ఈ పరిస్థితి ఆ బ్యాంక్‌ను మూసివేయాల్సిన పరిస్థితి కూడా కల్పించవచ్చు. మార్కెట్‌లు తెరచి ఉంటే మాత్రమే.. తన సేవింగ్స్ భద్రంగా ఉన్నాయో లేదో ఇన్వెస్టర్ తెలుసుకోగలడు. మార్కెట్‌ను మూసివేస్తే ఆయా స్టాక్స్‌ లోయర్ సర్క్యూట్‌కు వస్తాయా.. అప్పర్ సర్క్యూట్‌ను తాకుతాయా.. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో తెలుసుకోవడం అసాధ్యం అయిపోతుంది.

అప్షన్స్ ట్రేడర్లు పీడకలే
ఆప్షన్స్ అంటే టైం ప్రకారం ప్రీమియం కలిగి ఉంటాయి. సడెన్‌గా ట్రేడింగ్ ఆపేస్తే.. వీటిలో బైయింగ్, సెల్లింగ్ చేసిన వారికి తిరిగి తెరిచే సమయానికి వాటి రేట్లలో దారుణమైన మార్పులు చోటు చేసుకుని.. వారి పెట్టుబడికి చేటు చేస్తాయి. హఠాత్తుగా మార్కెట్లను మూసివేయడం అనే అంశం.. ఆర్థిక రంగంపై విశ్వాసాన్ని కూడా దెబ్బ తీస్తుంది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్‌కు ప్రధాన భూమిక ఉన్న మార్కెట్లలో ఇలా చేయడం ఏ మాత్రం సరికాదు.

ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్‌మార్కెట్లను మూసివేయడం అంటే... వాటిని నియంత్రించడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రధాన అధికారులకు సాధ్యం కాలేదని అంగీకరించి.. వైఫల్యాన్ని ఒప్పుకోవడమే అవుతుంది.