పతనంలో షాపింగ్ చేస్తున్న ప్రమోటర్స్!!

పతనంలో షాపింగ్ చేస్తున్న ప్రమోటర్స్!!

కరోనా వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. ఆ సెక్టార్.. ఈ స్టాక్.. అనే సంబంధం లేకుండా.. అన్ని రంగాలకు చెందిన  తీవ్ర స్థాయిలో కుప్పకూలిపోతున్నాయి. రీటైల్ ఇన్వెస్టర్లు, హెచ్‌ఎన్ఐలు, దేశీయ సంస్థాగత మదుపర్లు, ఎఫ్‌డీఐలు.. ఇలా ప్రతీ సెగ్మెంట్ నుంచి భారీ అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. అందరూ ఇలా అమ్మకాలకు దిగుతున్న సమయంలో.. దలాల్ స్ట్రీట్‌లో ప్రమోటర్ల యాక్టివిటీ మరోరకంగా ఉంది. అత్యంత చవకగా లభిస్తున్న తమ కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు... ఆయా కంపెనీల ప్రమోటర్లు ఆసక్తి చూపుతున్నారు. భారీ స్థాయిలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ.. వాటాలను పెంచుకుంటున్నారు.

ప్రమోటర్లు వాటాలు కొనుగోలు చేయడం అంటే.. సహజంగా ఆయా స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్లో స్టాక్స్ కోలుకోవడం జరగకపోయినా... కంపెనీలలో ప్రమోటర్స్ హోల్డింగ్ మాత్రం పెరుగుతోంది. చిన్న కంపెనీలతో పాటు బడా కార్పొరేట్ సంస్థలు కూడా ఇలా ప్రమోటర్స్ హోల్డింగ్‌ను పెంచుకునే షాపింగ్‌లో తెగ బిజీగా ఉన్నాయి.

టాటా సన్స్, గోద్రెజ్, బజాజ్... ఈ కార్పొరేట్ సంస్థల ప్రమోటర్స్ వాటాలు పెంచుకోవడం గురించి వార్తలు వచ్చాయి. కానీ మార్చి 1 నుంచి మార్కెట్లను పరిశీలిస్తే.. ఇప్పటివరకూ 200లకు పైగా స్మాల్, మిడ్‌క్యాప్ కంపెనీలలో తమ వాటాలను ప్రమోటర్లు పెంచుకున్నారు. తక్కువ వాల్యుయేషన్స్‌లో స్టాక్స్ లభిస్తున్న సమయంలో షేర్‌లు కొనుగోళ్లు చేసి.. కంపెనీలో తమ వాటాను గణనీయంగా పెంచుకుంటున్నారు.

మార్చి 1 నుంచి పరిశీలిస్తే.. ఇప్పటివరకూ 230 కంపెనీలలో ప్రమోటర్లు వాటాలను పెంచుకున్నారు. ఇందుకోసం ఆ కంపెనీ ప్రమోటర్స్ దాదాపు రూ. 3000 కోట్లను మార్కెట్లలో కుమ్మరించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి,

ఇలా షేర్‌లను కొనుగోలు చేసిన కొన్ని కంపెనీల వివరాలను పరిశీలిద్దాం. గత వారం ఎల్&టీ 7.5 మి. షేర్లను పెంచుకోగా.. రూ. 70 కోట్ల విలువైన షేర్లను మైండ్‌ట్రీ పెంచుకుంది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌లో రూ. 35 కోట్ల విలువైన షేర్లను ఇండియాబుల్స్ సంస్థ ప్రమోటర్లు కొనుగోలు చేశారు. వెల్‌స్పన్ ఎంటర్‌ప్రైజెస్, చంబల్ ఫెర్టిలైజర్స్, ఎంఆర్ఎఫ్ సంస్థల ప్రమోటర్లు రూ. 30 కోట్ల వరకూ విలువైన షేర్లను కొనుగోళ్లు చేశారు.

తమ కంపెనీల ఫండమెంటల్స్ ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నాయని ఆ సంస్థల ప్రమోటర్ల విశ్వాసం... ప్రస్తుతం నెలకొన్న బలహీన సెంటిమెంట్‌ను అధిగమించేలా చేసి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీలలో జరుగుతున్న ఈ తరహా ఇన్‌సైడర్ యాక్టివిటీస్‌ను ఇన్వెస్టర్లను ఎంతో నిశితంగా పరిశీలించాలని.. ప్రస్తుత పరిస్థితులలో ఇది ఇంకా ముఖ్యమని ఎనలిస్ట్‌లు సూచిస్తున్నారు. ఏదైనా కంపెనీలో ప్రమోటర్ వాటా పెంచుకునేందుకు ఆసక్తి చూపడం, వీక్ మార్కెట్‌లో కూడా భారీ స్థాయిలో షేర్‌లను కొనుగోలు చేయడం అంటే దీర్ఘ కాలంలో.. ఆ కంపెనీపై వారికి ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుందని అంటున్నారు.