చరిత్రలోనే అతి పెద్ద కష్టం-నష్టం.. కరోనా!

చరిత్రలోనే అతి పెద్ద కష్టం-నష్టం.. కరోనా!

నావెల్ కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని ముంచెత్తుతున్న మహమ్మారి అంటువ్యాధి ఇది. మార్చ్ 11న కరోనా వైరస్ కారణంగా సోకుతున్న కొవిద్-19ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ విపత్తుగా ప్రకటించింది. 2009లో సోకిన హెచ్1ఎన్1 స్వైన్ ఫ్లూ తర్వాత... ప్రపంచంపై ప్రభావం చూపగల అంటువ్యాధిగా కరోనాను మాత్రమే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ప్రకటించింది. అయితే.. ఇలాంటి మహమ్మారి వ్యాధులతో ప్రపంచం అంతా అతలాకుతలం కావడం ఇదేమీ ప్రథమం కాదు... ఆ మాటకు వస్తే ఆఖరు కూడా కాకపోవచ్చు. కానీ ఆర్థిక వ్యవస్థలను సైతం తీవ్రస్థాయిలో కరోనా వైరస్ దెబ్బ తీస్తోంది. గతంలో ఇలా ప్రపంచం మొత్తం విస్తరించిన వ్యాధుల గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం.


సార్స్... స్వైన్ ఫ్లూ... గత కొన్నేళ్లలో మనం విస్తృతంగా ఉన్న అంటువ్యాధులు. వీటితో కూడా నష్టం తీవ్రంగానే ఉన్నా... కొన్ని నియంత్రణలతో విస్తృతంగా వ్యాపించకుండా అరికట్టగలిగారు. కానీ అంటువ్యాధుల చరిత్రలో వీటికంటూ కొన్ని ప్రత్యేక పేజీలు నిలిచిపోయాయనే మాట మాత్రం వాస్తవమే. అయితే.. కరోనా వైరస్ కారణంగా వ్యాపిస్తున్న కొవిద్-19 విషయంలో మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయని.. చరిత్రలో ఎన్నడూ ఎరుగని స్థాయిలో ఉపద్రవాన్ని ఎదుర్కునే అవకాశం ఉందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ఇదే స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందితే.. ప్రపంచ జనాభాలో 40 శాతం మందికి.. అంటే ఏకంగా 300 కోట్ల మంది ప్రజలు ఈ అంటువ్యాధికి గురికాక తప్పదేమో అన్నది.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడిస్తున్న అనుమానం.


ఇక హిస్టరీలో దేశదేశాల్లో విస్తరించి.. పెద్ద సంఖ్యలో మనుషుల ప్రాణాలను బలిగొన్ని అంటువ్యాధుల వివరాలను పరిశీలిస్తే.. 1580లో ఆసియాలో ఫ్లూ సంబంధిత వ్యాధి ప్రబలింది. అప్పట్లో దీనికి ఎలాంటి పేరు పెట్టకపోయినా.. ఆసియాలో మొదలైన ఈ మహమ్మారి.. ఏషియన్ కంట్రీస్‌లో లక్షలకొద్దీ ప్రజలను బలి తీసుకుంది.

 

ఆధునిక చరిత్ర విషయానికి వస్తే... ఇప్పటివరకూ 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ‌ను అత్యంత ప్రమాదకర, అత్యధిక మరణాలకు దారితీసిన అంటువ్యాధిగా పరిగణిస్తారు. హెచ్1ఎన్1 వైరస్ కారణంగా సోకిన ఈ ఏవియన్ ఫ్లూయ.. 4 నుంచి 5 కోట్ల మంది ప్రజలను చంపేసింది. అయితే.. ఈ వ్యాధి కారణంగా ఇన్ని మరణాలు సంభవించడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. వ్యాధి తీవ్రత ఒక అంశం అయితే.. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం జరగడం.. జీవన పరిస్థితులు కఠినంగా ఉండడం... వైద్య సదుపాయాలు అంతగా లేకపోవడం కూడా... కోట్ల మరణాలకు కారణమైంది.

 

1950వ దశలో మరో రకమైన ఫ్లూ.. చైనాలోని యున్నన్‌లో ప్రారంభమైంది. ఇది ఏకంగా 10 లక్షల మందికి పైగా ప్రజల ప్రాణాలను బలిగొంది. దీనికి కొనసాగింపు కాకపోయినా... అదే దశకంలో కొన్ని సంవత్సరాల తరువాత హాంగ్‌కాంగ్‌లో ప్రబలిన ఫ్లూ అంటువ్యాధి దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణంగా నిలిచింది. ఆ తరువాత 2009 హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ కారణంగా... ఇప్పటివరకూ ఏకంగా 60 లక్షల మంది తమ ప్రాణాలు విడిచిపెట్టారు. 


సింపుల్‌గా సార్స్ అని పిలిచుకునే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, మెర్స్ అని పిలిచే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్‌లు... గత 20 ఏళ్లలో తలెత్తిన ఆరోగ్య విపత్తులు. ఈ రెండింటిని మించి కొవిద్-19 మహమ్మారిగా పరిణమించింది. సార్స్ వ్యాధితో 916 మరణాలు నమోదైతే.. మెర్స్ కారణంగా 858 మరణాలు రికార్డ్ అయ్యాయి. ఇవి ప్రపంచదేశాలను భయపెట్టినా మెడిసిన అందుబాటులో ఉండడం, నియంత్రించగలగడంతో వీటి ద్వారా ఆర్థిక వ్యవస్థలపై అంతగా ప్రభావం పడలేదు. కానీ కరోనా వైరస్ సంగతి విస్తృతి అలా కనిపించడం లేదు. దేశ దేశాలను లాక్‌డౌన్‌... షట్‌డౌన్ స్థితికి తోసేసింది. అన్ని రకాల కార్యకలాపాలు నిలిచితున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, ఔషధ సంబంధిత రంగం, కమ్యూనికేషన్ విభాగాలు తప్ప సగం ప్రపంచం పైగా మూత వేయాల్సి వచ్చింది.

 

 

ఇప్పుడు వ్యాపిస్తున్న కొవిద్-19 వ్యాధికి కరోనావైరస్ కారణం అయితే.. 1918లో 5 కోట్ల మంది ప్రజలను ప్రాణాలు తీసిన వైరస్ పేరు ఇన్‌ఫ్లుయాంజా వైరస్. గత దశాబ్దంలో సోకిన సార్స్ కారణంగా... రోగులు విపరీతంగా నీరసానికి గురి కావడంతో.. అనారోగ్య లక్షణాలు బయటకు కనిపించాయి. కానీ, కరోనా వైరస్ విషయానికి వస్తే.. మొదట ఎలాంటి లక్షణాలు కనిపించకుండా ప్రారంభమయ్యే కరోనా వైరల్ డిసీజ్.. ఆ తర్వాత ప్రాణాలు హరించే స్థితికి తీసుకువస్తోంది. ఈ వ్యాధి గల రోగులను ముందుగా ఆరోగ్య సిబ్బంది గుర్తించలేకపోవడానికి కారణం... కొన్ని రోజుల తర్వాత కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులలో... ముందస్తుగా ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించకపోవడం లేదా అతి స్వల్పంగా జలుబు, దగ్గు రావడం మాత్రమే కనిపించడం. కరోనా పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తి వేలాది మందికి ఆ రోగాన్ని అంటించగల స్థాయిలో కోట్ల కొద్దీ క్రిములను మోసుకెళ్లే క్యారియర్. ఈ వైరస్ మనుషులను కొరియర్‌గా ఉపయోగించుకుంటా.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. వ్యాధి వ్యాప్తి అంతు చిక్కని స్థాయిలో ఉండడంతోనే నియంత్రణ అసాధ్యంగా మారిపోతోంది. అందుకే కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్యతో పోల్చితే మరణాల రేటు తక్కువ శాతం కనిపిస్తున్నా... మరణాల సంఖ్య విషయంలో మాత్రం సార్స్, మెర్స్‌ల కంటే ఎక్కువగా నమోదవుతోంది.

2009 ఫ్లూ వ్యాధి పిల్లలు, యువతలో కూడా కనిపించగా.. 80 శాతం మరణాలు 65 ఏళ్లకు పైబడ్డ వ్యక్తులవే. కానీ కరోనా వైరస్ మాత్రం 65 ఏళ్లకు పైబడ్డ వారిని మరీ ఎక్కువగా బలి తీసుకుంటుంది. అందుకే హెచ్1ఎన్1 వైరస్‌ను కరోనా వైరస్ కంటే తక్కువ ప్రమాదకారిగా పరిగణించాల్సి వస్తోంది. 2015,16లలో జైకా వైరస్ వ్యాపించినప్పుడు కేవలం 18 మరణాలు మాత్రమే సంభవించాయి. ఇది దోమల నుంచి మాత్రమే వ్యాపించింది. కానీ కరోనా మాత్రం రెస్పిరేటరీ ఫ్లూయిడ్స్... అంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు బయటకు వచ్చే స్వల్ప ద్రవాలతో వ్యాప్తి చెందుతోంది.

ఇవి ప్రపంచాన్ని భయపెట్టిన అంటువ్యాధులు అయితే.. ఇవేవీ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపలేదు. కానీ కరోనా వైరస్ మాత్రం.. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను ఇప్పటికే సగానికి సగం చేసేసింది. స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సంపద ఇప్పటికే 40 శాతానికి పైగా హరించుకుపోగా.. ప్రస్తుతం మూతపడ్డ పారిశ్రామిక రంగం, ఇతర ఇండస్ట్రీల కారణంగా.. భవిష్యత్తులో కూడా దీని ప్రభావం వెంటాడనుంది. మరోవైపు ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఛాయలు నెలకొన్న సమయంలో బయటపడ్డ కరోనా వైరస్... మొత్తం ప్రపంచాన్నే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసేంత శక్తిని కలిగి ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.