రెండేళ్ల దిగువకు ఐసీఐసీఐ, ఆరేళ్ల దిగువకు యాక్సిస్

రెండేళ్ల దిగువకు ఐసీఐసీఐ, ఆరేళ్ల దిగువకు యాక్సిస్

దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్‌లు.. ప్రస్తుత మార్కెట్ పతనంలో భారీగా నష్టపోతున్నాయి. ఏడాది గరిష్ట స్థాయి నుంచి కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఈ స్టాక్స్ ఏకంగా 45 శాతం పైగా పతనం అయ్యాయంటే.. అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.

కరోనావైరస్ ప్రభావంతో మార్కెట్ పతనం నుంచి.. ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాల జోరు చాలా ఎక్కువగా ఉంటోంది. దీంతో బ్యాంక్ నిఫ్టీ ఎన్నడూ కనీవిని ఎరుగని స్థాయిలో నష్టాలను నమోదు చేసుకుంటోంది.

ఇవాళ కూడా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు అయిన సెన్సెక్స్, నిఫ్టీలు 10 శాతం లోయర్ సర్క్యూట్ వద్దకు పడిపోతే.. బ్యాంక్ నిఫ్టీ ఈ సమయంలో 15 శాతం క్షీణించడం గమనించాలి.

ఐసీఐసీఐ బ్యాంక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 552.20 కాగా.. ఇవాల్టి ట్రేడింగ్‌లో 15 శాతం క్షీణించి రూ. 293.85కు పడిపోయింది.

ఇక యాక్సిస్ బ్యాంక్ పరిస్థితి మరీ దారుణగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 827.75 కాగా.. ప్రస్తుతం ఇది రూ. 342.55కు పడిపోయింది. ఇవాళ ఒక్క రోజే యాక్సిస్ బ్యాంక్ షేర్ ధర 20 శాతం క్షీణించింది.