ఈవారం సెన్సెక్స్ ఎంత నష్టపోయిందో తెలుసా?

ఈవారం సెన్సెక్స్ ఎంత నష్టపోయిందో తెలుసా?

ప్రపంచ మార్కెట్ల సపోర్ట్‌ లేకపోవడంతో ఈవారం దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. వారాంతాన మార్కెట్లు కోలుకున్నప్పటికీ... భారీ నష్టాల నుంచి మాత్రం గట్టెక్కించలేకపోయాయి. కరోనా భయాలతో ఈవారం మార్కెట్లు గజగజ వణికిపోయాయి. కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఈవారం తొలినాలుగు రోజులు దేశీయ మార్కెట్లు భారీ కరెక్షన్‌కు గురవడంతో రూ.19.50 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గురువారం వరకు బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1,09,76,781 కోట్లకు పడిపోయింది. దీంతో తొలి 4 రోజుల్లో సెన్సెక్స్‌ 5815.25 పాయింట్లు నష్టపోయింది. 

ఇక వారాంతాన దేశీయ మార్కెట్లు భారీగా కోలుకున్నాయి. శుక్రవారం సెన్సెక్స్‌ 1628 పాయింట్లు, నిఫ్టీ 482 పాయింట్లు, బ్యాంక్‌ నిఫ్టీ 234 పాయింట్లు లాభపడ్డాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 4188 పాయింట్లు, నిఫ్టీ 1210 పాయింట్లు, బ్యాంక్‌ నిఫ్టీ 4849 పాయింట్లు నష్టపోయాయి. 2008 డిసెంబర్‌ తర్వాత ఈవారం దేశీయ సూచీలు ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఈవారం నిఫ్టీ 8వేల దిగువకు పడిపోయి మూడేళ్ళ కనిష్టానికి... సెన్సెక్స్‌ కూడా 28వేల దిగువకు పడిపోయి 38 నెలల కనిష్ట స్థాయిని నమోదు చేశాయి. మార్కెట్లు బేర్‌గ్రిప్‌లోకి వెళ్ళడంతో ఈవారం అన్ని రంగాల సూచీలు నష్టాలతో ముగిశాయి.