చికెన్‌తో చిక్కేమీ లేదు.. కరోనాతో లింకేమీ లేదు..

చికెన్‌తో చిక్కేమీ లేదు.. కరోనాతో లింకేమీ లేదు..

కరోనా వైరస్ వివరీతంగా వ్యాపిస్తూ.. ప్రపంచాన్నే వణికిస్తూ.. ఇప్పటికి 180కి పైగా దేశాలను భయపెడుతోంది. ఈ వైరస్ ఎలా ప్రారంభమైందనేందుకు ఇప్పటివరకూ ఎలాంటి కారణాలు లభించకపోయినా... వ్యాపించడంపై మాత్రం అనేక భయాందోళనలు మాత్రం రేకెత్తాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణకు దాదాపు అన్ని దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నా... పలు అపోహలు కూడా షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా ప్రజల ఆహారపు అలవాట్లతోనే కరోనా వైరస్ మొదలైందంటూ ప్రారంభమైన ప్రచారం.. ఇప్పుడు మాంసాహారం తినేందుకు కూడా చాలామందిని భయపెడుతోంది. చికెన్, మటన్‌లు మాత్రమే కాదు.. ప్రజలు కోడిగుడ్లు తినేందుకు కూడా జంకుతున్నారు.

అంతా సోషల్ మీడియా హంగామానే

కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వ విభాగాలు ఎంతగా కృషి చేస్తున్నా.. వాట్సాప్ వంటి సోషల్ మాధ్యమాల్లో ప్రజలను బెంబేలెత్తించే ప్రచారాలకు లోటు లేకుండా పోతోంది. మాంసాహారం తింటే కరోనా వైరస్ త్వరగా సోకుతుందని.. అందుకే కొంతకాలం వీటికి దూరంగా ఉండాలంటూ రూమర్స్ మొదలవడంతో... చికెన్, మటన్ ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే.. నాన్-వెజ్ ఫుడ్ ఐటెమ్స్‌కు.. కరోనా వైరస్‌కు ఏమాత్రం సంబంధం లేదని.. వీటిని భుజించడం కారణంగా కరోనా వైరస్ కారణంగా సోకే కొవిద్-19 వ్యాధి సోకే అవకాశం లేదని.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకటించింది.

 

ఐసీఎంఆర్ ఏమంటోందంటే

దేశవ్యాప్తంగా రాష్ట్రాల స్థాయిలోను, స్థానికంగాను పలు దశలలోను కరోనా వైరస్ టెస్ట్‌లను ఐసీఎంఆర్ నిర్వహిస్తోంది. ఏదైనా ప్రత్యేక ఆహారం కారణంగా ఇలాంటి వ్యాధి సోకుతుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని.. ఈ వైరస్‌కు అసలు ఆహారంతో సంబంధం లేదని చెబుతున్న ఐసీఎంఆర్.. ప్రజలు భేషుగ్గా చికెన్ సహా అన్ని రకాల నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తినవచ్చని చెబుతోంది. ఈవైరస్ కంటే కూడా.. నాన్‌వెజ్‌పై జరుగుతున్న ప్రచారం కారణంగానే... దేశవ్యాప్తంగా పౌల్ట్రీ రంగం విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కరోనా వైరస్ కంటే కూడా కరోనా వైరస్ పై భయమే ఎక్కువ ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారంటే.. చికెన్, ఎగ్స్ తినడంపై జనాలు ఎంతగా భయపడుతున్నారో అర్ధమవుతుంది.

 

అమెరికాలో పరిస్థితేంటో తెలుసా

ఒకవైపు మన దేశంలో ఇలా కరోనాకి.. చికెన్‌కి లింక్ చేసిన ప్రజలు విపరీతంగా భయపడుతుంటే.. యూఎస్ సహా పలు దేశాలలో పరిస్థితి రివర్స్‌లో ఉంది. టైసన్ ఫుడ్స్ అనే అతి పెద్ద మీట్ ప్రాసెసింగ్ యూఎస్ సంస్థ.. ఇప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో మాంసాహారాన్ని సిద్ధం చేస్తోంది. చికెన్, మటన్ మాత్రమే కాదు.. బీఫ్, పోర్క్ వంటి మాంసాహారం కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిందని.. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత రీటైల్ కస్టమర్ల నుంచి డిమాండ్ అధికంగా ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అనేక ప్రాంతాలలో రెస్టారెంట్స్‌ను మూసివేస్తుండడంతో.. ఆహార ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అధిక స్థాయిలో స్టాక్‌ను కొనుగోలు చేస్తున్నారని ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు చెబుతున్నాయి.

Image result for chicken coronavirus

చికెన్ సూప్, లెమనేడ్‌లతో కరోనా కంట్రోల్

కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన బాధితులు కూడా దీని నుంచి దూరం అయేందుకు తమకు చికెన్ హెల్ప్ చేసిందంటూ చెబుతుండడం మరింత ఆశ్చర్యకరమైన విషయం. చికెన్ సూప్, లెమనేడ్‌లను తీసుకోవడం ద్వారా తాను కరోనా వైరస్‌ను జయించానని లండన్ వాసి, మాజీ బ్రిటిష్ వైద్యురాలు అయిన క్లేర్ జెరాడా చెబుతున్నారు. వైరస్ సోకిన కొన్ని రోజులకు తాను చిన్నపాటి బరువులు కూడా లిఫ్ట్ చేయలేకపోయానని.. అయితే జ్వరం, దగ్గు, వణుకులతో పాటు గొంతునొప్పి, చిరాకు, జాయింట్ల నొప్పులు, తలనొప్పి, ఛాతీ నొప్పి కూడా తనను వేధించాయని చెబుతున్న ఈ మాజీడాక్టర్.. లెమనేడ్, చికెన్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఈ వైరస్ నుంచి విముక్తి పొందానని అంటున్నారు.

Image result for chicken coronavirus

చికెన్ బిర్యానీ ఫుల్‌గా తినేశా

మన దేశంలో తొలి కరోనా సర్వైవర్‌గా నిలిచిన 20 ఏళ్ల త్రిషూర్ యువతి.. ఎంతోమంది ప్రార్ధనలు, నైతిక మద్దతుతోపాటు బిర్యానీ కూడా తనకు హెల్ప్ చేసిందని చెబుతున్నారు. కరోనా ఇంకా ఈ స్థాయిలో దాడి చేయకమునుమే... వూహాన్ నుంచి బయలుదేరి కేరళలోని తన స్వంత ఊరికి వచ్చిన ఈ యువతి.. కొన్ని రోజులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. జనవరి 30న తాను కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగినప్పుడు ఎమోషనల్‌గా బ్రేక్‌డౌన్ అయినా.. హెల్త్ ఇన్‌స్పెక్టర్, కౌన్సిలర్ తనలో స్థైర్యం నింపారని.. క్వారంటైన్‌కు సహకరించడంతో పాటు.. చికెన్ బిర్యానీ సహా అన్ని రకాల నాన్‌వెజ్ ఫుడ్ తీసుకున్నానని చెప్పింది.