టాటా గ్రూప్‌ స్టాక్స్‌పై ఈయనకు చాలా క్రేజ్‌... ఎవరాయన?

టాటా గ్రూప్‌ స్టాక్స్‌పై ఈయనకు చాలా క్రేజ్‌... ఎవరాయన?

దలాల్ స్ట్రీట్‌లో భారీ పతనం చోటు చేసుకుంటున్నా, ఒక ఇన్వెస్టర్ మాత్రం టాటా గ్రూప్ స్టాక్స్‌పై ఎంతో భరోసాగా ఉన్నారు.

ఆయన ఎవరో కాదు.. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్. ఈయన తాజాగా టాటా గ్రూప్ స్టాక్స్‌లో షేర్లను కొనుగోలు చేశారు. టాటా కమ్యూనికేషన్స్, టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లలో దాదాపు రూ. 6 కోట్ల విలువైన షేర్లను చంద్ర శేఖరన్ కొనుగోలు చేశారు.

ఆయా కంపెనీలు ప్రకటించిన ప్రకారం, టాటా కమ్యూనికేషన్స్, టాటా కెమికల్స్ కంపెనీలలో 1 లక్ష షేర్ల చొప్పున.. అలాగే టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లో 10,000 షేర్లను టాటా సన్స్ చీఫ్ కొనుగోలు చేశారు.

గత నెల రోజుల కాలంలో టాటా కమ్యూనికేషన్స్ షేర్ ధర సగానికి పైగా దిగి వచ్చింది.

ఎనలిస్ట్‌లు, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న ప్రకారం గమనిస్తే, రాబోయ రెండు త్రైమాసికాలలో డేటా వినియోగం గణనీయంగా పెరగనుంది. కొవిద్-19 వైరస్ కారణంగా.. వర్క్ ఎట్ హోమ్ కాన్సెప్ట్‌కు డిమాండ్ పెరుగుతుండడంతో డేటా వినియోగంలో 15 శాతం పెరుగుదల కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. 

టాటా కమ్యూనికేషన్స్ మొత్తం వ్యాపార ఆదాయంలో 80 శాతం డేటా వ్యాపారం నుంచే లభిస్తుండగా.. 91 శాతం ఎబిటా ఈ విభాగానికి చెందినదే
డేటా సెగ్మెట్ విషయంలో దేశంలో అతి పెద్ద కంపెనీగా టాటా కమ్యూనికేషన్స్ నిలుస్తోంది. అతిపెద్ద సముద్రగర్భ డేటా ట్రాన్స్‌మిషన్ నెట్వర్క్ కంపెనీకి ఉంది.అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్‌గా కంపెనీ నిలుస్తోంది.

ఇప్పుడు టాటా సన్స్ అధినేత ఎన్. చంద్రశేఖరన్ తన వాటాలను పెంచుకోవడం గమనిస్తే.. కంపెనీపై ఆయనకు ఎంతగా భరోసా ఉందో అర్ధమవుతుంది.