కంపెనీలు బైబ్యాక్‌కు ఎందుకు వస్తున్నాయంటే?

కంపెనీలు బైబ్యాక్‌కు ఎందుకు వస్తున్నాయంటే?

ఇటీవల కాలంలో షేర్ల ధరల పతనాన్ని నిలువరించేందుకు పలు సంస్థలు బైబ్యాక్ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. మార్కెట్‌లు భారీ ఒత్తిడికి లోనవుతుండటంతో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచడానికి పలు దేశీయ కంపెనీలు బైబ్యాక్‌ రావాలని యోచిస్తున్నాయి. గత 2వారాల్లో సన్‌ఫార్మా, థామస్‌ కుక్‌, సుప్రీం పెట్రోకెమ్‌, ఇమామి, ఎస్‌పీ అపెరల్స్‌లు బైబ్యాక్‌కు వస్తున్నట్టు లేదా ప్రతిపాదనలు సిద్ధం చేశామని ప్రకటించాయి. తాజాగా ఫార్మా రంగ సంస్థ సన్‌ఫార్మాకు తమ మొత్తం ఈక్విటీలో 1.67 శాతం విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయడానికి కంపెనీ బోర్డు అనుమతినిచ్చింది. ఒక్కో షేరు రూ.425 మించకుండా 4 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. దీంతో బుధవారం 10 శాతం క్షీణించిన సన్‌ఫార్మా షేర్‌ గురువారం ఒకశాతం లాభపడింది. 

B2

బైబ్యాక్‌తో లాభమేంటి?
సాధారణంగా లిస్టెడ్‌ కంపెనీలు డివిడెండ్‌ లేదా బైబ్యాక్‌ మార్గాల్లో తమ నగదు నిల్వలను వాటాదారులకు పంచుతుంటాయి. బైబ్యాక్‌లు ప్రకటించినప్పుడు కొన్ని వారాలపాటు ఆ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ వాల్యూమ్‌ అనూహ్యంగా పెరుగుతుంది. తాము కొన్న ధరకన్నా తక్కువ ధరకు  ట్రేడవుతున్న సందర్భంలో సదరు షేర్లను లాభంతో వదిలించుకునేందుకు బైబ్యాక్‌ ఆఫర్‌ పనికివస్తుంది. యాక్సెప్టెన్సీ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే రిటైల్‌ ఇన్వెస్టర్‌కు అంత లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఒకసారి బైబ్యాక్‌ పూర్తయ్యాక చలామణిలో ఉన్న షేర్ల సంఖ్య తగ్గడం జరుగుతుంది. దీంతో ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌ పెరగడానికి అవకాశాలుంటాయి. బైబ్యాక్‌ అనంతరం షేరు ధరలో వచ్చే ర్యాలీతో ఇన్వెస్టర్ల వద్ద మిగిలిన షేర్లకు మంచి రేటు వచ్చే ఛాన్స్‌లుంటాయి. 

రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు బైబ్యాక్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. బైబ్యాక్‌పై పన్నును ప్రభుత్వం ఓ ఏడాది పాటు తొలగించాలి లేదా నిలిపివేస్తే మంచిది. దీంతో కంపెనీలు లేదా ప్రమోటర్లు ఈ మారణహోమం సమయంలో ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపడానికి మార్కెట్‌ నుంచి షేర్లను బైబ్యాక్‌ చేయొచ్చు. అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ చైర్మన్‌ రామ్‌దిన్‌ అగర్వాల్‌ చెప్పారు.

మరోవైపు ఇప్పటివరకూ అన్‌లిస్టెడ్‌ కంపెనీలకు మాత్రమే ఉన్న షేర్‌ బైబ్యాక్‌ ట్యాక్స్‌... ఇప్పుడు లిస్టెడ్‌ కంపెనీలకూ వర్తింపజేస్తూ గత ఏడాది బడ్జెట్లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన గత ఏడాది బడ్జెట్లో షేర్‌ బైబ్యాక్‌పై 20శాతం పన్నును విధిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో గత ఏడాది కాలం నుంచి బైబ్యాక్‌లు భారీగా తగ్గాయి. అయితే మార్కెట్లలో భారీ కరెక్షన్‌ రావడంతో మళ్ళీ కంపెనీలు బైబ్యాక్‌పై దృష్టిపెట్టాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 48 కంపెనీలు రూ.17,550 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో 63 కంపెనీలు రూ.55,295 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేశాయి.