ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్ల చరిత్రలోనే కనీవినీ ఎరుగని పతనం మనం ప్రస్తుతం చవిచూస్తున్నాం. భారతీయ స్టాక్‌ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో 12430 పాయింట్ల ఆల్‌ టైం హైని తాకిన తరువాత నిఫ్టీ 4400 పాయింట్ల పతనంతో ఇన్వెస్టర్లను కలవర పరుస్తోంది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ పరిస్థితి చెప్పనవసరం లేదు. రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి హెవీ వెయిట్‌ స్టాక్స్‌లోనే 40 శాతానికి పైగా నష్టాలు గమనిస్తే ఎన్‌సీసీ వంటి స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ 70శాతం వరకూ పతనం కావడం ఆశ్చర్యపరచే అంశమే కాదు. ఈ సంక్షోభం మొత్తానికీ కారణమైన కోవిడ్‌-19 వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెను సంక్షోభంలో పడవేసింది. ఈ పరిస్థితి ఎవరూ వూహించనది కాదు. అనూహ్యమైన ఈ అమ్మకాల ఒత్తిడికి, తదనంతర పరిణామాలతో ఇన్వెస్టర్లు బిత్తరపోవడం చూస్తున్నాం.

ప్రత్యేకించి కొత్తగా మార్కెట్లలో ప్రవేశించిన వారికి, ప్రస్తుత పరిణామాలు ఎంతమాత్రం మిగుడు పడటం లేదు. అసలు ఈ మార్కెట్లలో ప్రవేశించడమే తాము చేసిన అతిపెద్ద అపరాధంగా వారు భావించడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే గత రెండు, మూడు దశాబ్దాలుగా మార్కెట్లను గమనిస్తున్న వారికి ఇప్పుడు పరిస్థితి ఒక అద్భుతమైన ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశంగా కనపడి తీరుతుంది. కరోనా వైరస్‌ తాకిడి ప్రమాదం సద్దుమణిగిన తరువాత క్రమేపీ ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం మొదలెడతాయి. దీన్ని ముందుగానే వూహించిన స్టాక్‌ మార్కెట్లూ కొన్ని నెలల తరువాత మరలా లాభాల బాటలో పయనించేందుకు ఉరకలు వేస్తాయి. చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్వల్ప వ్యవధిలో, అంటే కేవలం 19 రోజుల్లోనే యూఎస్‌ మార్కెట్లు బేర్‌ మార్కెట్‌ జోన్‌లోకి వెళ్ళిపోయాయి. ఇక్కడే కొన్ని రోజులు నష్టాల్లో కదలాడే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అయితే మార్కెట్లు ఎంత వేగంగా లాభాల పరుగులు తీస్తే అంతే వేగంగా పతనం కావడం ఎంత సహజమో అత్యంత  వేగంతో అగాధానికి జారిపోయిన పరిస్థితి నుంచీ అంతకు రెట్టింపు జోరుతో ఊర్ధ్వముఖ బాట పట్టడమూ సార్స్‌ సంక్షోభ  సమయంలోనూ, అటువంటి మరిన్ని సంఘటనల సమయంలోనూ మనం చూశాం.

ఇన్వెస్టర్ల కింకర్తవ్యం..
మార్కెట్ల బాటమ్‌అవుట్‌ అయ్యాయో లేదో ప్రస్తుతానికి తెలియదు కాబట్టి ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయ్యాలో అర్థంకాని అయోమయ స్థితిలో ఉన్నారు. అయితే సంక్షోభం సద్దుమణిగిన తరువాత వచ్చే లాభాలు అందిపుచ్చుకోవాలంటే ఈ అయోమయ అవస్థ నుంచి బయటపడి ఒక చక్కటి వ్యూహంతో ముందుకు సాగడం ఒక్కటే మార్గం. ఇప్పటికే పెద్ద మొత్తంలో మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన వారయినా లేక అంతగా ఇన్వెస్ట్‌ చేయని వారయినా తమ వద్ద ఉన్న నగదు నిల్వలు సరిచూసుకుని, తమ రిస్క్‌ తీసుకోగలిగే సామర్థ్యాన్ని బేరీజు వేసుకుని ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సిద్ధం కావాలి. 

ఎటువంటి షేర్లు కొనాలి..
ప్రస్తుత తరుణంలో షేర్లు కొనాలి అని ఉపక్రమించే వారికి ఎటువంటి షేర్లు కొనాలి అన్న సంశయం తలెత్తడం సహజం, ఇటువంటి వారందరూ తమ ఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియని 4 తరగతుల షేర్లుగా విభజించుకోవాలి.

1. మొదటి విభాగంలో ఆయా రంగాల్లో మార్కెట్‌ లీడర్లుగా పటిష్టమైన వ్యాపార వ్యూహంతో ముందుకు సాగే సంస్థలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి బ్యాంకింగ్‌ రంగంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవారు ఆ రంగంలో నాయకత్వ స్థానంలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు ఐదింటినీ ఎంపిక చేసుకోవడం ఉత్తమం. లేదా ఈ ఐదింటిలో 3 బ్యాంకులు ఎంపిక చేసుకోండి. రానున్న రెండు, మూడేళ్ళలో ఈ బ్యాంకులు రెండింతలు, మూడింతల రిటర్న్స్‌ ఇవ్వడం ఖాయం.

2. రెండవ విభాగంలో ఈ వైరస్‌ దాడి వలన ప్రయోజనం పొందే సంస్థలు ఎటువంటివో గమనించి ఇన్వెస్ట్‌ చేయడం. ఉదాహరణకి ప్రస్తుత తరుణంలో అందరూ శానిటైజర్లు, సబ్బులు, నిత్యావసర వస్తువులు ఎగబడి కొని నిల్వ చేసుకుంటున్నారు. అటువంటి సంస్థల షేర్లు ఆకర్షణీయంగా కనపడుతున్నాయి. (హిందుస్తాన్‌ యూనిలీవర్‌, గోద్రేజ్‌ కన్జ్యూమర్‌, డీమార్ట్‌ మొదలగునవి) అదే విధంగా వర్క్‌ఫ్రం హోమ్‌ కల్చర్‌ కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలకి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. స్టీల్, కెమికల్స్‌ వంటి ఉత్పత్తుల తయారీ చైనాలో నిలిచిపోయింది కాబట్టి మన దేశీయ సంస్థలకి ఇదొక మంచి అవకాశం కానున్నది. ఇటువంటి సంస్థల షేర్లను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి.

3. పబ్లిక్‌ సెక్టర్‌ సంస్థల షేర్లను గమనించండి. బీపీసీఎల్‌, ఎయిర్‌ ఇండియా వంటి సంస్థల డిజిన్వెస్ట్‌మెంట్‌ తరువాత ప్రభుత్వం ఇతర సంస్థలనూ అమ్మకానికి పెట్టనుంది. ఏయే ప్రభుత్వ సంస్థ బ్యాలెన్స్‌ షీట్లు బలంగా ఉన్నాయో గమనించండి. ఈ సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వం చేతి నుంచి బలమైన ప్రైవేట్‌ యాజమాన్యాల చేతికి వెళ్తున్న తరుణంలో ఆకర్షణీయంగా కనపడతాయి. ఉదా: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌, బీహెచ్‌ఈఎల్‌, ఒఎన్‌జీసీ  మొదలగునవి.

4. కమాడిటీస్‌ ధరలు మల్టీ ఇయర్‌ కనిష్టానికి పడిపోయిన తరుణంలో ప్రభుత్వాల స్టిమ్యులస్‌ కారణంగా లేదా సహజంగానే కోలుకునే దశలో ఆయా కమాడిటీస్‌ ఉత్పత్తి చేసే సంస్థల షేర్లకు గిరాకీ ఏర్పడుతుంది. టాటా స్టీల్‌, వేదాంతా, ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ వంటి సంస్థలు ఈ కోవకి చెందుతాయి. 

పైన చెప్పిన విధంగా షేర్లను ఎంపిక చేసుకుని, మీ అసెట్‌ అలోకేషన్‌ నిష్పత్తిని పాటిస్తూ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ కొనసాగిస్తే వచ్చే రెండు, మూడేళ్ళ వ్యవధిలో మలటీ బ్యాగర్‌ రిటర్న్స్‌ సంపాదించడం ఖాయం. 

- వసంత్‌ కుమార్‌, బిజినెస్‌ ఎడిటర్‌

vasanth