ఆగని బ్యాంక్‌ షేర్ల పతనం

ఆగని బ్యాంక్‌ షేర్ల పతనం

గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొంతకాలం నుంచి బ్యాంకింగ్‌ స్టాక్స్‌ నేలచూపులు చూస్తున్నాయి. గురువారం బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో షార్ట్‌ కవరింగ్‌ వచ్చినా చివర్లో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్నింగ్‌ సెషన్‌లో బ్యాంక్‌ నిఫ్టీ 19వేల దిగువకు పడిపోయింది. బ్యాంక్‌ నిఫ్టీ ఇవాళ ఇంట్రాడే కనిష్టం నుంచి 2200 పాయింట్లు కోలుకుంది. చివరకు రెండున్నర శాతం నష్టంతో బ్యాంక్ నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు కోల్పోయి 20,083 వద్ద క్లోజైంది. 

యెస్‌ బ్యాంక్‌ సంక్షోభంతో మొదలైన బ్యాంకింగ్ షేర్ల పతనం... ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. గత నాలుగైదు రోజులుగా యెస్‌ బ్యాంక్‌ ఆశలు రేపినప్పటికీ... మళ్ళీ షారామాములుగా మళ్ళీ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. బుధవారం ఇంట్రాడేలో రూ.85 మార్కును యెస్‌ బ్యాంక్‌ అధిగమించడంతో మళ్ళీ ఈ షేర్‌కు పూర్వ వైభవం రావచ్చని ఇన్వెస్టర్లలో సంతోషం నెలకొంది. అయితే యెస్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ మధుకపూర్‌ 2.48 కోట్ల షేర్లను విక్రయించడంతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. రూ.65.07 యావరేజ్‌ వద్ద ఈ షేర్లను మధుకపూర్‌ విక్రయించారు. దీంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ బలహీనపడింది. దీంతో ఇవాళ ఇంట్రాడేలో 22 శాతం నష్టపోయిన యెస్‌ బ్యాంక్‌ చివరకు 11.35 శాతం నష్టంతో రూ.53.90 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. ఇక బుధవారం సాయంత్రం నుంచి యెస్‌ బ్యాంక్‌పై మారటోరియాన్ని ఎత్తివేశారు. గురువారం నుంచి 3 రోజుల పాటు అదనపు పనిగంటల్లోనూ పనిచేయనున్నట్టు యెస్‌ బ్యాంక్‌ ప్రకటించింది. 

మరోవైపు ముఖ్యంగా యెస్‌ బ్యాంక్‌ ప్రభావం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌పై పడింది. మార్చి 3న రూ.1110 వద్ద ట్రేడైన యెస్‌ బ్యాంక్‌ గత 15 రోజులుగా 60శాతం పైగా నష్టపోయింది. ఇంట్రాడేలో 18శాతం పైగా నష్టపోయిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ చివరకు 3.50 శాతం నష్టంతో రూ.444 వద్ద ముగిసింది. ఈ సంస్థ ఆర్థిక పరిస్థితిపై పలు పుకార్లు వినిపిస్తుండగా... వాటినన్నింటినీ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఖండించి స్పష్టతనిచ్చినప్పటికీ ఇన్వెస్టర్లలో ఇంకా అనుమనాలు తొలగిపోలేదు.  రీటైల్, కార్పొరేట్ విభాగాలలో నిలకడగా రాణిస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విత్‌డ్రాయల్స్ చేసినా.. ప్రస్తుతం బ్యాంక్ ఎంతో స్ట్రాంగ్‌గా, లాభదాయకతతో ఉందని ఇండస్ఇండ్ బ్యాంక్ వర్గాలు చెప్పాయి.

Bandhan Bank Opened 125 New Braches in India - Sakshiఇక తీవ్ర సంక్షోభంలో ఉన్న  యెస్‌ బ్యాంకులో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించడం బంధన్‌ బ్యాంక్‌ కొంపముంచింది. యెస్‌ బ్యాంక్‌లో రూ.300 కోట్లను ఇన్వెస్ట్‌ చేసేందుకు బంధన్‌ బ్యాంక్‌ బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో మార్చి 3న రూ.423 వద్ద కదలాడిన బంధన్‌ బ్యాంక్‌ షేర్‌ ఇంట్రాడేలో రూ.190 స్థాయికి పడిపోయింది. అంటే ఈ షేర్‌ కూడా దాదాపు 60-65శాతం నష్టపోయింది. గురువారం ట్రేడింగ్‌లో లోయర్‌ సర్క్యూట్‌(రూ.191)ను టచ్‌ చేసిన బంధన్‌ బ్యాక్‌ చివరకు 10.53 శాతం నష్టంతో రూ.200.55 వద్ద ముగిసింది.  

SBIఇక ఇప్పటికే 49 శాతం వాటా కొనుగోలుకు రూ.7,250 కోట్లు పెట్టుబడి పెడతామని ఎస్‌బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా చెరో రూ.1000 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.600 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి.

ఈ నిర్ణయంతో ఫిబ్రవరి 26న రూ.328 వద్ద కదలాడిన ఎస్‌బీఐ 60శాతం పైగా నష్టపోయింది. ఇవాళ 5.శాతం నష్టంతో రూ.203 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ ఫిబ్రవరి 20న రూ.2370 వద్ద కదలాడింది. గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ దాదాపు 35శాతం పైగా క్షీణించింది. ఇవాళ 6శాతం పైగా నష్టపోయిన ఈ షేర్‌ చివరకు స్వల్ప నష్టంతో రూ.1621.20 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి 20న రూ.547 వద్ద కదలాడిన మరో బ్యాంకింగ్‌ షేర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ గత నెల రోజుల్లో దాదాపు 45శాతం క్షీణించింది. ఇవాళ ఇంట్రాడేలో 8శాతం పైగా నష్టపోయిన ఈ షేర్‌ చివరకు 4.73 శాతం నష్టంతో రూ.339.15 వద్ద ముగిసింది. 

ఇక యాక్సిస్‌ బ్యాంక్‌ విషయానికి వస్తే ఫిబ్రవరి 27న రూ.736 వద్ద ట్రేడైంది. ఈ  స్టాక్‌ కూడా గత 22 రోజుల్లో 40శాతం పైగా కరెక్షన్‌కు గురైంది. ఇవాళ 9.50% నష్టంతో రూ.427.75 వద్ద స్థిరపడింది. కోటక్‌ మహీంద్రా బ్యాంకు కూడా గత నెలరోజులుగా నేలచూపులు చూస్తోంది. ఫిబ్రవరి 27న రూ.1682 వద్ద ట్రేడైన ఈ స్టాక్‌ కూడా దాదాపు 40శాతం క్షీణించి ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. ఇవాళ ఇంట్రాడేలో లోయర్‌ సర్క్యూట్‌కు సమీపానికి (రూ.1000) వచ్చిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మిడ్‌సెషన్‌ తర్వాత ఒక్కసారిగా కోలుకుంది. చివరకు 3శాతం లాభంతో 1207.75 వద్ద కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ట్రేడింగ్‌ ముగించింది. 

ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్లకు యెస్‌ బ్యాంక్‌ సంక్షోభం మాత్రమే కాదు కరోనా వైరస్‌ కూడా చుక్కలు చూపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు భారీగా నష్టపోవడం కూడా బ్యాంకింగ్‌ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఏదేమైనా గత నెల రోజులుగా బ్యాంకింగ్‌ షేర్స్‌ ఇన్వెస్టర్ల కళ్ళ నుంచి రక్తాన్ని కార్పిస్తున్నాయి. 

Capture1

Capture2

Capture3