హమ్మయ్యా... అసలు మొత్తం కట్టేశాం..!

హమ్మయ్యా... అసలు మొత్తం కట్టేశాం..!

ఏజీఆర్‌ కింద చెల్లించాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించామని టెలికాం రంగ సంస్థ వొడాఫోన్‌-ఐడియా ప్రకటించింది. ఇప్పటికే పలు విడతల్లో ఏజీఆర్‌ బకాయిలను చెల్లించిన వొడాఫోన్‌-ఐడియా మిగిలిన రూ.3354 కోట్లను చెల్లించినట్టు వెల్లడించింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లించామని, ఇక వడ్డీ మాత్రమే కట్టాల్సి ఉందని తెలిపింది. 

"ఏజీఆర్‌ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.3354 కోట్ల బకాయిలను చెల్లించాం. ఇప్పటివరకు మేం ఏజీఆర్‌ రూపంలో టెలికాం విభాగానికి రూ.6854 కోట్లను(తాజా చెల్లింపుతో కలిపి) చెల్లించాం. దీంతో టెలికాం విభాగానికి చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని పూర్తి చెల్లించాం" అని బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. 

గత కొంతకాలం నుంచి వార్తల్లో నిలుస్తోన్న ఏజీఆర్‌ బకాయిల విషయానికి వస్తే అసలు, వడ్డీ, జరిమానాలు కలిపి వొడాఫోన్‌ ఐడియా దాదాపు 53వేలు చెల్లించాలని టెలికాం విభాగం గతంలో తెలిపింది. అయితే స్వీయ లెక్కింపు అంచనా వేసిన వొడాఫోన్‌ ఐడియా.. తాము కట్టాల్సిన ఏజీఆర్‌ బకాయిల మొత్తం రూ.21,553కోట్లని ఈనెల 6న ప్రకటించింది. ఇందులో 2006-07 నుంచి 2018-19 కాలానికి అసలు రూ. 6,854కోట్లు, మిగతాది వడ్డీ అని పేర్కొంది. ఈ బకాయిల నిమిత్తం ఫిబ్రవరి 17న రూ. 2,500కోట్లు, ఫిబ్రవరి 20న మరో రూ. 1000 కోట్లు చెల్లించామని, తాజాగా నేడు మరో రూ. 3,354కోట్లు చెల్లించామని కంపెనీ తెలిపింది. దీంతో అసలు మొత్తం చెల్లించినట్లయిందని వొడాఫోన్‌ ఐడియా వెల్లడించింది.