ఇండస్‌ఇండ్‌ పతనానికి కారణమిదేనా?

ఇండస్‌ఇండ్‌ పతనానికి కారణమిదేనా?

విస్తృతమైన అమ్మకాల మధ్య ఇవాళ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. ఇంట్రాడేలో షేర్‌ 13శాతం పైగా నష్టంతో రూ.699 వద్ద ట్రేడవుతోంది. ఉదయం 11:03 నిమిషాల వరకు ఎన్‌ఎస్‌ఈలో 47.30 లక్షల షేర్ల ట్రేడింగ్‌ వాల్యూమ్‌ నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా వైరస్‌ కేసులు, అలాగే ప్రపంచ ఆర్థిక వృద్ధిపై  భయాందోళనలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. 

మరోవైపు బ్యాంక్‌ ఆర్థికస్థితిపై వచ్చిన పుకార్లను ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ సీఈఓ రమేష్‌ సోబ్తి ఖండించారు. ప్రస్తుతం మార్కెట్లో వస్తోన్న పుకార్లు అన్నీ అవాస్తవమని, ఆ వార్తలను పరిగణనలోకి తీసుకోవద్దని ఆయన చెప్పారు. బలమైన క్యాపిటలైజేషన్‌ / లిక్విడిటీ, అధిక క్రెడిట్‌ రేటింగ్స్‌ వంటి అంశాలతో అధిక లాభదాయకతో సంస్థ నిర్మాణంపై దృష్టిసారించామని ఆయన అన్నారు. 

భారత్‌లోని కొన్ని ప్రైవేట్‌ బ్యాంకుల కస్టమర్లు, ఇన్వెస్టర్లు ఆందోళనతో ఉన్నారు. యెస్‌ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌ చేయాలని తాము భావిస్తున్నట్టు వస్తున్న వార్తలు నిరాధారమని ఇప్పటికే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. అయినా ఈ స్టాక్‌ పతనం ఆగట్లేదు. యెస్‌ బ్యాంక్‌లో పెట్టుబడుల ప్రతిపాదనను కంపెనీ మేనేజ్‌మెంట్‌, బోర్డు స్థాయిలో ఎలాంటి ప్రతిపాదనలు లేవని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ సీఈఓ సోబ్తి చెప్పారు.