మార్కెట్ క్రాష్‌లో చిత్తవుతున్న మెగా ఐపీఓలు!

మార్కెట్ క్రాష్‌లో చిత్తవుతున్న మెగా ఐపీఓలు!

ప్రతీ మార్కెట్ క్రాష్‌లోనూ ఒక మెగా ఐపీఓ ఇన్వెస్టర్లకు తీరని నష్టాలను మిగల్చడం పరిపాటిగా మారింది.

తాజాగా ఎస్బీఐ కార్డ్స్ ఐపీఓ పై రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి హై నెట్వర్త్ ఇండివడ్యువల్స్ వరకూ అందరూ చాలానే అంచనాలు పెట్టుకున్నారు.

కానీ గత నాలుగు వారాలుగా మార్కెట్లు భారీ నష్టాలను మూటకట్టుకుంటున్నాయి. కరోనా వైరస్ మార్కెట్ సెంటిమెంట్‌ను ఘోరంగా దెబ్బ తీసింది. 

దీనితో భారీ ప్రీమియంతో లిస్టింగ్ అవుతుందని భావించిన ఎస్‌బీఐ కార్డ్స్.. చివరకు డిస్కౌంట్‌తో ట్రేడింగ్ ప్రారంభించుకుంది.

రెండు వారాల క్రితం రూ. 380 ప్రీమియం.. అంటే... ఇష్యూ ధర రూ. 755 కాగా.. కనీసం రూ. 1050కు ఎగువన ఎస్‌బీఐ కార్డ్స్ లిస్ట్ అవుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. గ్రే మార్కెట్ ప్రీమియం ఈ స్థాయి వరకూ చేరుకుంది.

అయితే... కరోనా వైరస్ కారణంగా మార్కెట్లు పతనం కావడంతో.. ఆ ప్రభావం ఈ మెగా ఐపీఓ పై తీవ్ర ప్రభావం చూపింది. 9 శాతం పైగా డిస్కౌంట్‌తో రూ. 683 వద్ద మాత్రమే లిస్టింగ్ జరుపుకుంది.

ఆ తర్వత కొంత మేర కోలుకుంటున్నట్లు కనిపించినా... ఇది ఇన్వెస్టర్లకు తీరని ఆశాభంగంగా చెప్పాలి.

HNIల పరిస్థితి దారుణం
ముఖ్యంగా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ అయితే 13 నుంచి 15 శాతం ఇంట్రెస్ట్‌తో ఎస్‌బీఐ కార్డ్స్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేశారు. కానీ.. ఇప్పుడు లిస్టింగ్‌లో దాదాపు 10 శాతం నష్టం రావడంతో.. వీరికి తీవ్ర నష్టాలు తప్పడం లేదు.

మరోవైపు.. రీటైల్ ఇన్వెస్టర్లు కూడా ఎస్బీఐ కార్డ్స్‌తో నిరాశ చెందక తప్పలేదు. ఈ విభాగంలో 2.5 రెట్లు మాత్రమే బిడ్డింగ్ జరగడంతో.. దాదాపుగా ప్రతీ రెండు లాట్స్ బిడ్డింగ్‌కు ఒక లాట్ చొప్పున అలాట్ అయింది.

 

గతంలో ఆర్‌ పవర్
గతంలో రిలయన్స్ పవర్ విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పటికి అతి పెద్ద ఐపీఓగా మార్కెట్లలో లిస్టింగ్‌కు రాగా.. మార్కెట్ పతనం కారణంగా.. రిలయన్స్ పవర్ లిస్టింగ్‌లోనే భారీగా పతనం అయింది. ఇన్వెస్టర్లకు కంపెనీ బోనస్ షేర్లు కూడా ప్రకటించాల్సి వచ్చింది.

ఇప్పుడు ఎస్‌బీఐ కార్డ్స్ కూడా భారీ అంచనాల మధ్య మార్కెట్లలోకి వచ్చినా.. మదుపర్లకు నిరాశ మిగిల్చింది.