నాలుగోవంతు మాత్రమే అమ్ముకునే వీలు

నాలుగోవంతు మాత్రమే అమ్ముకునే వీలు

యెస్‌ బ్యాంక్‌ పునరుద్ధణ ప్రణాళికకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం పలికింది. యెస్‌ బ్యాంక్‌లో 49శాతం వాటాను ఎస్‌బీఐ కొనుగోలు చేయనుండగా... ఇందుకోసం ఇతర ఇన్వెస్టర్లను అనుమతిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఎస్‌బీఐ కొనుగోలు చేయనున్న వాటాల్లో 26శాతం వాటాకు మూడేళ్ళ లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. అలాగే యెస్‌ బ్యాంక్‌లో ఇన్వెస్ట్‌ చేసే ఇతర ఇన్వెస్టర్లకు తమ ఇన్వెస్ట్‌మెంట్‌లో 75శాతానికి మూడేళ్ళ లాక్‌ ఇన్‌ పీరియడ్‌ వర్తిస్తుంది. యెస్‌ బ్యాంక్‌ పునరుద్ధరణ నోటిఫికేషన్‌ విడుదల చేసిన వారం రోజుల లోపు కొత్త బోర్డును ఏర్పాటు చేస్తామని కేంద్రం వెల్లడించింది. 

ఈనెల 5న యెస్‌బ్యాంక్‌పై మారటోరియాన్ని విధిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఈనెల 18న ఎత్తివేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.  దీనిప్రకారం ఆర్‌బీఐ ప్రతిపాదించిన ‘యెస్‌బ్యాంకు పునరుద్ధరణ ప్రణాళిక-2020’ ఈనెల 13నుంచే అమలులోకి వచ్చింది. ఈ ప్రణాళికకు కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దాని ప్రకారం మూడో పనిదినం సాయంత్రం నుంచి నిషేధం ఎత్తివేత అమల్లోకి రానుంది. అంటే ఈనెల 18న సాయంత్రం 6గంటలకు యెస్‌బ్యాంకుపై ఈ తాత్కాలిక నిషేధం తొలగిపోతుంది. ప్రస్తుతం యెస్‌బ్యాంకు అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న ప్రశాంత్‌కుమార్‌ని కొత్తగా ఏర్పాటుకానున్న బోర్డు ఎండీ, సీఈఓగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

ఇక సంక్షోభంలో చిక్కుకున్న యెస్‌బ్యాంక్‌ను తిరిగి గాడిన పెట్టేందుకు ఆర్‌బీఐ, కేంద్రం నడుంబిగించాయి. పునరుద్ధరణ ప్రణాళికను ఆర్‌బీఐ రూపొందించగా, వెంటనే దానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో యెస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులకు లైన్‌ క్లియర్‌ అయింది. ఎస్‌బీఐ 49 శాతం వాటా కొనుగోలుకు రూ.7,250 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా చెరో రూ.1000 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.600 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంకులు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ లావాదేవీలు పూర్తయితే యెస్‌ బ్యాంక్‌లో దాదాపు 70శాతం వాటా ఈ 5 సంస్థల చేతుల్లోనే ఉంటుంది.