మార్కెట్‌ బుల్‌కు కరోనా వైరస్‌

మార్కెట్‌ బుల్‌కు కరోనా వైరస్‌

కరోనా వైరస్‌ మహమ్మారితో స్టాక్‌ మార్కెట్లు నేల చూపులు చూస్తూ ఇన్వెస్టర్ల కంట రక్త కన్నీరు కార్పిస్తున్నాయి. ఒకరోజూ భారీ లాభాలు, మరో రోజూ భారీ నష్టాలు, ఇంకో రోజూ ఇంట్రాడేలో భారీ ఒడిదుడుకులు... ఇవన్నీ చిన్న ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేస్తున్నాయి. ఏ స్ట్రాటజీతో ఉండాలో తెలియక చిన్న ఇన్వెస్టర్లు తమ విలువైన సంపదను కోల్పోతూ  మార్కెట్‌ సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు.

గత కొంతకాలం నుంచి ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో స్టాక్‌ మార్కెట్లు బల్లూకం పట్టులో చిక్కుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జోరుమీదున్న స్టాక్‌ మార్కెట్లు గత నెల రోజులుగా భారీ ఒత్తిడికి లోనవుతోన్నాయి. ముఖ్యంగా గత 15 రోజులుగా కరోనా వైరస్‌ ప్రభావంతో స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోయి రెండున్నరేళ్ళ కనిష్టానికి పడిపోయాయి. ఖండాంతరాలను దాటి అందరిమీదా స్వైర విహారం చేస్తోన్న కరోనా వైరస్‌... ప్రపంచ దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. మాంద్యం భయాలతో ఎఫ్‌ఐఐలు, డీఐఐలు అయినకాడికి తమ షేర్లను తెగనమ్ముకోవడంతో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరంలా కరిగిపోతోంది. గురు, శుక్రవారాల్లో మార్కెట్‌ ఫాల్‌లో మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 20 లక్షల కోట్లు పడిపోయిడంటే మార్కెట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. 

ముఖ్యంగా ఈవారం మార్కెట్లు భారీ సెల్లింగ్‌ ప్రెజర్‌కు గురయ్యాయి. సోమవారం రికార్డు స్థాయి ఒక రోజు నష్టాన్ని చవిచూసిన మార్కెట్లు, అంతకుమించిన క్షీణతను గురువారం నమోదు చేశాయి. ఒకే రోజు అత్యంత అధిక నష్టాలను నమోదు చేసుకున్నాయి. ఒక్క గురువారం రోజే 11 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇక శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్‌ లోయర్‌ లెవల్స్‌ నుంచి  దాదాపు 5వేల పాయింట్లు రీబౌండ్‌ అయింది. హైయర్ లెవెల్స్ నుంచి ఇండెక్స్‌లు 20 శాతం మేర క్షీణించడంతో.. ఇండెక్స్‌లలో షార్ట్‌ కవరింగ్‌, కన్సాలిడేషన్‌ కారణంగానే.. వారాంతంలో రికవర్ అయ్యాయని.. ఇప్పటికిప్పుడు మార్కెట్‌లు బేర్ గ్రిప్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పలేమని.. మార్కెట్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తే.. ఇక ముందు రాబోయే మార్కెట్ ఫాల్‌ను ఆపడం, అంచనా వేయడం కూడా కష్టమని చెబుతున్నారు. 

కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌, అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు, ఇరాక్‌పై అమెరికా సైనిక దాడులు, ఒపెక్ దేశాలతో రష్యా క్రూడ్ వివాదం ప్రారంభించడంతో భారీగా చమురు ధరలు పడిపోవడం వంటి అంశాలతో ఈవారం అన్ని రంగాల సూచీలు 52వారాల కనిష్టానికి పడిపోయాయి. బ్లూ చిప్‌ స్టాక్స్‌ దశాబ్ద కాల కనిష్టానికి పడిపోయాయి. సెన్సెక్స్‌  2017 స్థాయికి పడిపోయింది. ఇక నిఫ్టీ-50 షేర్లలో ఈవారం ఒఎన్‌జీసీ, వేదాంతా, గెయిల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, యూపీఎల్‌లు 20శాతం పైగా నష్టపోయాయి. 

ఊహించని స్థాయిలో వచ్చిన ఇంత పతనం.. లాంగ్ టెర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలమైన సమయంగా భావించాలని.. అయితే, ఇప్పటికిప్పుడు మార్కెట్‌లో ఎంట్రీకావడం రిస్క్ అవుతుందంటున్న మార్కెట్ విశ్లేషకులు.. ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీల్లో కరెక్షన్‌ వచ్చినప్పుడల్లా... దశల వారీగా ఆయా షేర్లను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. శుక్రవారం మిడ్‌సెషన్‌లో మార్కెట్లలో బౌన్స్‌ వచ్చినప్పటికీ... మార్కెట్లు ఎప్పుడెలా కదలాడుతాయో అంతుచిక్కని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది.