ఇక్కడ కొంటే ఎక్కడివరకూ గోల్డ్ పెరుగుతుంది?!

ఇక్కడ కొంటే ఎక్కడివరకూ గోల్డ్ పెరుగుతుంది?!

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. కరోనా భయాలు మొదలైనప్పటి నుంచి బులియన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బులియన్ మార్కెట్ శరవేగంగా దూసుకుపోతోంది. ఒక దశలో 1700 డాలర్లు దాటిన ఔన్స్ బంగారం ధర.. ప్రస్తుతం కొంతమేర శాంతించినట్లుగా కనిపించినా.. ఇది హైయర్ లెవెల్స్‌లో వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ మాత్రమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

మరోవైపు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు బ్రేక్ లేకుండా పరుగులు పెడుతున్నాయి. రూ. 39 వేల స్థాయి నుంచి కొన్ని వారాల సమయంలోనే రూ. 45 వేలకు మేలిమి బంగారం రేటు చేరుకుంది. తాజా గరిష్ట స్థాయితో పోల్చితే.. ప్రస్తుతం కొంతమేర తగ్గినట్లుగా కనిపిస్తున్నా.. ఇది తాత్కాలికమేనని.. త్వరలోనే రూ. 50 వేల మార్కుకు 10 గ్రాముల పుత్తడి చేరుకుంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి.

కరోనా భయాలతో అంతర్జాతీయ మార్కెట్లలో భారీ సెల్ఆఫ్ రావడం.. డాలర్‌కు డిమాండ్ పెరగడంతో.. మన రూపాయి మారకం భారీగా క్షీణిస్తోంది. ఒకవైపు ఈక్విటీ మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడులవైపు చూస్తున్నారు. డాలర్ పుంజుకుని రూపాయి పతనం కావడం.. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం రేట్లు పెరగడం.. ఈక్విటీ మార్కెట్ల పతనం కారణంగా.. గోల్డ్ రేట్లు మరింతగా పెరగవచ్చని బులియన్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

రాబోయే కాలంలో రూ. 50వేలకు 10 గ్రాముల బంగారం (24 క్యారెట్) చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత స్థాయిలతో పోల్చితే 10 శాతం రిటర్న్స్ అతి తక్కువ కాలంలోనే అందుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్లు పతనం అయిన ప్రతిసారీ.. బంగారం ధరలు భారీగా పెరిగిన సందర్భాలను వారు గుర్తు చేస్తున్నారు. అందుకే ఇలాంటి సమయంలో గోల్డ్‌లో పెట్టుబడులు సురక్షితం అని విశ్లేషిస్తున్నారు.