రూ. 50వేలు తాకనున్న బంగారం ధర!!

రూ. 50వేలు తాకనున్న బంగారం ధర!!

పెరగడమే తప్పా, తగ్గడమే తెలియనట్లున్న బంగారం ధర త్వరలో కొండెక్కే అవకాశాలు కనిపిస్తోన్నాయి. తన రికార్డును తానే బద్దలుకొడుతూ రోజురోజుకో ఆల్‌టైమ్‌ రికార్డును గోల్డ్‌ రేట్‌ క్రియేట్‌ చేస్తోంది. కరోనా వైరస్‌ ఎఫెక్ట్‌తో ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవడంతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయంగా బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ 1650 డాలర్లకు చేరువలో ఉంది. గత 3రోజులుగా గోల్డ్‌ రేట్‌ తగ్గుముఖం పడుతున్నప్పటికీ భవిష్యత్‌లో బంగారం ధరకు రెక్కలు రావచ్చని, ఔన్స్‌ గోల్డ్‌ 2000 మార్కును అధిగమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం రెసిస్టెన్స్‌ లెవెల్స్‌లో గోల్డ్‌ కదలాడుతోందని, అయితే స్టాక్‌ మార్కెట్‌ పతనం ఇలాగే కొనసాగితే ధరలు పైపైకి వెళ్లే ఛాన్స్‌ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. త్వరలో జరిగే మీటింగ్‌లో యూఎస్‌ ఫెడ్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటే బంగారానికి డిమాండ్‌ పెరగనుందని గోల్డ్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం రూ. 45,500 పలుకుతున్న బంగారం ధర అతి త్వరలోనే 50వేల మార్కుకు చేరుకునే అవకాశాలున్నాయి.

కరోనా వైరస్‌, భౌగోళిక రాజకీయ పరిణామాలు, ఆర్థిక ఇబ్బందులు, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటి అంశాలు పది గ్రాముల బంగారం ధరను రూ.50,000 స్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర పెరగడంతో పాటు.. మన రూపాయి మారకం పతనం కూడా గోల్డ్ రేట్లను పరుగులు పెట్టిస్తోంది.

. గత కొన్ని రోజులుగా బంగారం ధర తీవ్ర హెచ్చతగ్గులను చవిచూసినా ప్రస్తుతం సరికొత్త గరిష్ట స్థాయిల వద్ద కదలాడుతోన్నాయి. 

బంగారం నుంచి రాబడి పొందాలంటే ఫిజికల్ గోల్డ్‌కు బదులు గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయాలని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఫిజికల్ మార్కెట్ టెన్షన్స్ ఉండవని వారు చెబ్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌ల విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ వైపు మొగ్గుచూపాలని సూచించారు. ఇక అధిక రిటర్న్స్ ఆశించే వాళ్లు గోల్డ్ మైనింగ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని రికమండ్‌ చేస్తున్నారు.