వాహన రంగ పయనం ఎటు?

వాహన రంగ పయనం ఎటు?

గత ఏడాదికాలం నుంచి ఆటో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆటో రంగానికి ప్రోత్సాహకాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నా ఆశించని ప్రకటనలు వెలువడకపోవడం ఇండస్ట్రీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వాహన రంగ పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని ఇండస్ట్రీ భయపడుతోంది.

వాహన విక్రయాలు తగ్గిపోవడంతో దేశీయ ఆటో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కొన్ని కంపెనీలైతే ప్రొడ‌క్షన్ హాలిడే కూడా పాటించాయి. మ‌రికొన్ని ఉద్యోగుల సంఖ్యలో కోత విధించి వ్యయాలు తగ్గించుకున్నాయి. భారత వృద్ధిరేటు సైతం అంత‌కంత‌కూ దిగ‌జారుతూ రావ‌డంతో దేశీయ వాహన రంగం డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. దీనికి తోడు బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు తీసుకురావడం వల్ల ధరలు మరింత పైపైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాలతో వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.

గత రెండేళ్ళ నుంచి ఆటో రంగం సంక్షోభంలో ఉన్నప్పటికీ, ఈ రంగానికి రెండు బడ్జెట్లలోనూ నిరాశే ఎదురైంది. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొని ఉండటంతో ఎన్నో సవాళ్ళు ఎదురవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా రేటింగ్స్‌ ఆటోమొబైల్‌ రంగానికి సంబంధించిన ఔట్‌లుక్‌ను సవరించింది. 2020-21 సంవత్సరానికి గాను స్టేబుల్‌ నుంచి నెగిటివ్‌కు తగ్గించింది. ఇప్పటికే వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనంగా ఉంది. దేశవ్యాప్తంగా ఎలక్ర్టిక్‌ వాహనాలను పెంచడానికి సంబంధించిన విషయాల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ప‌ర్యావ‌ర‌ణ మార్పుల‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం బీఎస్‌-6 వాహ‌నాల త‌యారీని ప్రోత్సహిస్తోంది. అయితే ఈ వాహ‌నాల‌ త‌యారీ ఖ‌ర్చు 8-10 శాతం పెరుగుతోంది. దీంతో వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.