మొబైల్స్ ఇండస్ట్రీకి కరోనా భయాలు

మొబైల్స్ ఇండస్ట్రీకి కరోనా భయాలు

కరోనా వైరస్‌ ప్రభావం అన్ని రంగాలను వెంటాడుతోంది. చైనాలో విజృంభిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి దెబ్బకు దేశీయ స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమ కుదేలవుతోంది. ఇప్పటికే పలు మొబైల్‌ పరిశ్రమలు తమ ప్లాంట్‌ను మూసివేసుకున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాపంగా మొబైల్‌ కొరత 20 నుంచి 30 శాతం వరకు ఉండే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. 

తక్కువ ధర, ఎక్కువ ఫీఛర్లు అనే మంత్రంతో భారతీయ మొబైల్‌ మార్కెట్లో చైనా సంస్థలదే ఆధిపత్యం నడుస్తోంది. భారత్‌లో అత్యధిక అమ్మకాలను సాధిస్తోన్న సంస్థల్లో మెజార్టీ కంపెనీలు చైనాకు చెందినవే. వీటి దెబ్బకు శామ్‌సంగ్‌, సోనీ, ఎల్‌జీ, నోకియా వంటి అగ్రశ్రేణి సంస్థలన్నీ ఢీలాపడ్డాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి తలక్రిందులైంది. కరోనా దెబ్బకు ఆయా చైనా మొబైల్‌ కంపెనీలు తమ ఉత్పత్తిని దాదాపు నిలిపివేయడంతో భారత్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ల రాక తగ్గిపోయింది. దీంతో జనం దేశీయ ఫోన్లవైపు చూస్తున్నారు.

కరోనా దెబ్బకు చైనాలో ఉత్పాదక రంగం స్తంభించిపోయింది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండటంతో దేశీయ స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం పడింది. చైనా నుంచి దిగుమతి అయ్యే విడిభాగాలతో కొన్ని దేశీయ సంస్థలు స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నాయి. ముందస్తుగా పరికరాలను తయారు చేయడం వల్ల ఇప్పటి వరకైతే కొరత లేదని, అయితే చైనా ప్లాంట్‌లు వెంటనే ఉత్పత్తిని ప్రారంభించకపోతే దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 

మొబైల్‌ తయారీలో కీలక విడిభాగాలైన ఎల్‌సీడీ డిస్‌ప్లే, ప్యానెళ్లు, స్పీకర్లు, ఫింగర్‌ప్రింట్‌లను ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయిన మొబైల్‌ తయారుకాదు. దీంతో చేసేదేమి లేకపోవడంతో దేశీయ తయారీ సంస్థలు తమ ప్లాంట్లను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామ్‌సంగ్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, ఇతర సంస్థలైన ఒప్పో, వివో, వన్‌ప్లస్‌, షియోమీలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 

ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు ఇబ్బంది లేకపోయినప్పటికీ... మార్చిలో మాత్రం కొరత అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌ దెబ్బతో మొబైళ్లకు డిమాండ్‌ పెరిగి రాబోయే రోజుల్లో ధరలు పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.