యెస్‌ బ్యాంక్‌లో కొనసాగుతోన్న పతనం

యెస్‌ బ్యాంక్‌లో కొనసాగుతోన్న పతనం

ప్రైవేట్‌ రంగ సంస్థ యెస్‌ బ్యాంక్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇవాళ ఇంట్రాడేలో 4శాతం పైగా నష్టపోయి రూ.35.20కు పడిపోయింది. ఉదయం 11 గంటల వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో దాదాపు  5.34 కోట్ల షేర్లు చేతులు మారాయి. యెస్‌ బ్యాంక్‌ ఆర్థిక కష్టాలు ఆ బ్యాంక్‌ డిపాజిటర్లనూ భయపెడుతున్నాయి. దీంతో బ్యాంక్‌ షేరు గత ఏడాది 74 శాతం పడిపోయింది. ఈ సంవత్సరం కూడా యెస్‌ బ్యాంక్‌కు పెద్దగా కలిసి రాలేదు. మూలధన అవసరాల కోసం 120 కోట్ల డాలర్లు సమీకరించాలన్న ప్రయత్నాలూ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీంతో ఈ  ఏడాది ఇప్పటి వరకు యెస్‌ బ్యాంక్‌ షేరు ధర 22 వరకు పడిపోయింది. 

వ్యయాలను తగ్గించుకునేందుకు అధిక వడ్డీ ఉండే డిపాజిట్లను తామే వద్దనుకున్నామని యెస్‌ బ్యాంక్‌ సీఈఓ రవనీత్‌ గిల్‌ చెప్పారు. అయినా డిపాజిటర్లలో ఇంకా భయాలు తొలగిపోలేదు. బ్యాంక్‌ త్వరలో క్యూ-3 ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఈ ఫలితాలు వెలువడితేగానీ అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో ఎంత విలువైన డిపాజిట్లను డిపాజిటర్లు వెనక్కి తీసుకున్నారనే విషయం తెలియదు. బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఈ త్రైమాసికంలోనూ పెద్దఎత్తునే డిపాజిట్లు ఖాళీ అయి ఉంటాయని భావిస్తున్నారు.