ఈ 16 స్టాక్స్‌పై బడ్జెట్‌ దెబ్బ ఎలా ఉంటుందంటే!!

ఈ 16 స్టాక్స్‌పై బడ్జెట్‌ దెబ్బ ఎలా ఉంటుందంటే!!

బడ్జెట్ 2020 వచ్చేసింది. ఏ రంగానికి ఏం ఒరుగుతుంది.. ఏ సెక్టార్ ప్రభావితం కానుంది.. వంటి అంశాలైప విశ్లేషణలు కూడా బాగానే వస్తున్నాయి. అయితే.. బడ్జెట్ తర్వాత ఈ స్టాక్స్ బాగుంటాయి... ఈ స్క్రిప్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయనే అనాలిసిస్ బాగానే వినిపిస్తూ ఉంటుంది. అయితే.. బడ్జెట్ కారణంగా నెగిటివ్ ఎఫెక్ట్ పడే స్టాక్స్ ఏవి? వేటిని దూరంగా ఉంచాలి? వేటిని వదిలించుకోవాలి అనే అంశాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉటంుంది.

సంస్కరణల విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గబోమనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ద్వారా సుస్పష్టంగానే చెప్పారు.

ద్రవ్యలోటును జీడీపీలో 3.5 శాతానికి పరిమితం చేయడం.. దూకుడుగా డిజిన్వెస్ట్‌మెంట్ వంటి పలు అంశాలు బడ్జెట్‌లో కనిపించాయి. అయితే..  బడ్జెట్ తర్వాత ఎరువులు, పొగాకు, బీమా, నిర్మాణ రంగంతో పాటు మూలధన వస్తువులలో కొన్ని విభాగాలపై ప్రతికూల ప్రభావం పడడం ఖాయంగా కనిపిస్తోంది

ఈ బడ్టెట్‌లో వినియోగం పెంచాలనే లక్ష్యాన్ని నిర్దిష్టంగా నిర్దేశించుకున్నట్లు కనిపిస్తోందని.. విశ్లేషకులు చెబుతున్నారు. బడ్జెట్‌లో చేపట్టిన చర్యల ఫలితంగా ఈ కింద ఇవ్వబడిన 16 స్టాక్స్‌లో ప్రతికూలత కనిపించవచ్చని.. బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.:

ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్:
కేంద్ర బడ్జెట్‌ 2020లో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జాతీయ విపత్తు అనిశ్చిత నిధి (నేషనల్ కెలామిటీ కంటిజెంట్ డ్యూటీ) అంటూ పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సిగరెట్ పొడవు, ఫిల్టర్/నాన్-ఫిల్టర్ ఆధారంగా వెయ్యికి రూ. 200 నుంచి 735 మధ్య ఎన్‌సీసీడీని పెంచారు.
పైప్స్, సిగరెట్‌లకు స్మోకింగ్ మిక్స్‌చర్స్‌పై ఎన్‌సీసీడీని 45 నుంచి 60 శాతం మధ్య పెంచారు.
నమిలే పొగాకు వంటి ఇతర పొగాకు ఉత్పత్తులపై ఎన్‌సీసీడీని 10 నుంచి 25 శాతానికి పెంచారు. ఐటీసీ, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌కు ఈ ట్యాక్స్ ప్రతికూలం కానుంది.


టిటాగర్ వ్యాగన్స్, టెక్స్‌మాకో:
రైల్వే లైన్ డబ్లింగ్ పనులు, ట్రాక్ రెన్యువల్స్ వంటివి నెమ్మదించాయి. వ్యాగన్స్ (12,000), కోచ్‌లు (4,000) తయారీ 8-19 శాతం మేర తగ్గనుంది.


హావెల్స్ ఇండియా, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, వర్ల్‌పూల్:
కన్జూమర్ ఎలక్ట్రికల్ స్టాక్స్‌లో కొన్నింటికి ఈ బడ్జెట్ ప్రతికూలం కానుంది. ఏసీలు, రిఫ్రిజిరేట్ల కంప్రెసర్లపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 12.5 శాతం పెంచారు. కమర్షియల్ ఫ్రీజర్‌లపై కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ డ్యూటీని 7.5 నుంచి 15 శాతానికి పెంచారు.


ఎస్‌బీఐ లైఫ్, ఐసీఐసీఐ ప్రు లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్:
వ్యక్తిగత పన్నులో కొత్త పన్నుల విధానం బీమా కంపెనీలపై ప్రభావం చూపనుంది. బీమా, ఈఎల్ఎస్ఎస్, పీఎఫ్, పీపీఎఫ్ వంటి ఉత్పత్తులపై సెక్షన్ 80సీ పన్ను మినహాయింపు పొందే అవకాశం లేకుడా కొత్త పన్ను విధానాన్ని ప్రకటించారు. దీంతో పాటు మార్కెట్ లీడర్ అయిన ఎల్ఐసీని లిస్ట్ చేయనున్నారు.


ఎంబసీ REIT
హౌసింగ్ డిమాండ్‌ను పెంచేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకున్నారు. అయితే.. హౌసింగ్ (సెక్షన్ 24 లేదా సెక్షన్ 80సీ ప్రకారం వడ్డీ/అసలు) విభాగం పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం లేకుండా కొత్త పన్ను విధానం రూపకల్పన జరిగింది. అలాగే డివిడెండ్స్‌ను ఇకపై వ్యక్తిగత ఆదాయంలో చూపాల్సి ఉంటుంది.


చంబల్ ఫెర్టిలైజర్స్, దీపక్ ఫెర్టిలైజర్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్:
ఫెర్టిలైజర్ సబ్సిడీని 11 శాతానికి అంటే రూ. 71,300 కోట్లకు తగ్గించారు. దీంతో పాటు ముడి సరుకుల ధరలు ఏ మాత్రం పెరిగినా, ఎరువుల తయారీ కంపెనీలపై భారం పడుతుంది. 


ఇండియన్ ఆయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్:
ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్‌పై యాంటీ డంపింగ్ డ్యూటీని ఉపసంహరించుకోవడం.. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్‌లో ఈ రెండు స్టాక్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.