ఎల్ఐసీలో వాటా విక్రయానికి సిద్ధమైన కేంద్రం

ఎల్ఐసీలో వాటా విక్రయానికి సిద్ధమైన కేంద్రం

దేశీయ అతి పెద్ద బీమా సంస్థ అయిన భారతీయ జీవిత బీమా సంస్థ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో వాటాలు విక్రయించేందుకు కేంద్రం సిద్ధమైన విషయాన్ని.. కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఎల్ఐసీలో వాటాల విక్రయంపై.. కేంద్ర ఆర్ధిక శాఖ మరిన్ని అంశాలను వెల్లడించింది. ఐపీఓ ద్వారా ఎల్ఐసీలో వాటాను విక్రయించనుండగా... రానున్న ఆర్థిక సంవత్సరంలో రెండో భాగంలో ఎల్ఐసీ ఐపీఓ మార్కెట్లలోకి వచ్చే అవకాశం ఉందని.. ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

ఎల్ఐసీ సంస్థను లిస్టింగ్ చేయడానికి భారీ ప్రక్రియను చేపట్టాల్సి ఉందని ఆయన అన్నారు. న్యాయ శాఖతో పాటు పలు ఇతర న్యాయపరమైన అంశాలను కూడా చేపట్టాల్సి ఉండగా... ఇప్పటికే పలు ప్రక్రియలు ప్రారంభించామని రాజీవ్ కుమార్ తెలిపారు

ఎల్ఐసీని లిస్టింగ్ చేయడం కోసం కొన్ని రకాల న్యాయపరమైన మార్పులను ఐపీఓకు ముందే పూర్తి చేయాల్సి ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో సుమారు 10 శాతం వరకు వాటాను విక్రయించే అవకాశాలు ఉన్నాయని.. ఇప్పటివరకూ నిర్దిష్టమైన పరిమితిపై నిర్ణయం జరగలేదని కేంద్రం చెబుతోంది.

అయితే... ఎల్ఐసీ సంస్థను మార్కెట్లలో లిస్టింగ్ చేసినా సరే.. పాలసీహోల్డర్ల భద్రత దృష్ట్యా.. యాజమాన్యం మాత్రం ఎల్లప్పుడూ భారత ప్రభుత్వం వద్దనే ఉంటుందని కేంద్రం అంటోంది.
ఐపీఓకు మాత్రమే తాము సిద్ధం అవుతున్నామని... సంస్థను విక్రయించే ఉద్దేశ్యం లేదని కేంద్రం చెబుతోంది.

ఎల్ఐసీలో వాటా విక్రయం.. అలాగే ఐడీబీఐ బ్యాంకులో వాటాను పూర్తిగా విక్రయించడం ద్వారా మొత్తం రూ. 90,000 కోట్లు సమకూరుతాయని కేంద్రం ఆశిస్తోంది. ఈ ఏడాది మొత్తంగా రూ. 2.10 లక్షల కోట్లను డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సేకరించాలని.. కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్రానికి 100 శాతం వాటా ఉండగా.. ఐడీబీఐలో 46.5 శాతం వాటా కేంద్రం వద్దే ఉంది.

"స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లలో లిస్టింగ్ చేయడం ద్వారా ఆయా కంపెనీల విలువ వెల్లడవుతుంది. దీనితో పాటు కంపెనీ ఫైనాన్షియల్స్ అందరికీ అందుబాటులోకి వస్తాయి. సంపద సృష్టి విషయంలో రీటైల్ ఇన్వెస్టర్లకు కూడా అవకాశం చిక్కుతుంది. అందుకే ఎల్ఐసీని లిస్టింగ్ చేయనున్నాం" అని కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు.

మార్కెట్ ఏమంటోందంటే!
ఎల్ఐసీ ఐపీఓ విషయంలో మార్కెట్ వర్గాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. మన దేశఁలో ఇది "ఈ దశాబ్దపు అతి పెద్ద ఐపీఓ" (ఐపీఓ ఆఫ్ ద డెకేడ్)గా నిలవవచ్చని అంటున్నారు. అలాగే ప్రపంచంలో అతి పెద్ద సంస్థ సౌదీ ఆరామ్‌కోను లిస్టింగ్ మాదిరిగానే దీనికి కూడా స్పందన ఉండవచ్చని అంటున్నారు.

ప్రస్తుతం బారతీయ బీమా రంగంలో అతి పెద్ద సంస్థగా ఎల్ఐసీ నిలుస్తోంది. ఇప్పటిటికీ దేశీయ బీమా మార్కెట్‌లో 70 శాతా వాటా ఎల్ఐసీకే సొంతం. పాలసీల సంఖ్య విషయంలో 76.28 శాతం మార్కెట్ వాటా ఎల్ఐసీ  సొంతం కాగా... ప్రీమియం అమౌంట్‌లో 71 శాతం వాటా ఎల్ఐసీ వద్దనే ఉంది.

 

ఐడీబీఐ కూడా ఎల్ఐసీ సొంతమే!
ఐడీబీఐ బ్యాంక్ సహా... ఎల్ఐసీ సంస్థకు పలు అనుబంధ సంస్థలు ఉన్నాయి. 2019లో ఐడీబీఐ బ్యాంక్‌లో నియంత్రణ వాటాను ఎల్ఐసీ కొనుగోలు చేసింది.LIC