టాప్‌ పొజిషన్లో నిలిచేందుకు సరికొత్త ప్రణాళికలతో టెలికాం కంపెనీలు

టాప్‌ పొజిషన్లో నిలిచేందుకు సరికొత్త ప్రణాళికలతో టెలికాం కంపెనీలు

టెలికాం వార్‌ ఫీక్‌ స్టేజ్‌కి చేరింది. రకరకాల ఆఫర్లతో ఇప్పటివరకు కస్టమర్లను ఆకట్టుకున్న టెలికాం ఆఫర్లు... తాజాగా వైఫై కాలింగ్‌ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ ఇప్పటికే వైఫై కాలింగ్‌ను ప్రారంభించగా... ఇతర ఆపరేటర్లు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారు. అసలు వైఫై కాలింగ్‌ అంటే ఏమిటి? దానితో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఏఏ ఫోన్లలో ఇది పనిచేయనుంది? తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.

మార్కెట్లో టాప్‌ పొజిషన్లో నిలిచేందుకు టెలికాం ఆపరేటర్లు సరికొత్త ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా  కొత్త కొత్త ఫీచర్లు, రీఛార్జ్‌ అప్‌డేట్స్‌ తమ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే దేశంలోని దిగ్గజ టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో వైఫై కాలింగ్‌ సేవలను ప్రారంభించి పోటీ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఈ కొత్త సర్వీస్ తో మొబైల్ నెట్ వర్క్ సరిగ్గా లేకపోతే వైఫై ద్వారా కాలింగ్ ను చేసుకోవచ్చు. రిలయన్స్ జియో వైఫై కాలింగ్ ను సపోర్ట్ చేసే 150కు పైగా స్మార్ట్ ఫోన్ల జాబితాను ఇప్పటికే వెల్లడించింది. ఎయిర్ టెల్ కూడా దాదాపు 100 వరకు స్మార్ట్ ఫోన్లకు ఈ సేవలను అందిస్తోంది. 

వీవోవైఫై లేదా వాయిస్‌ ఓవర్‌ వైఫైనే వైఫై కాలింగ్‌ అని అంటారు. సాధారణంగా మనం ఫోన్లలో చేసే కాల్స్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ ద్వారా వెళ్తాయి. అయితే వీవోవైఫైలో మనం చేసే కాల్స్‌ వైఫై ద్వారా వెళ్తాయి. అందుకనే దాన్ని వైఫై కాలింగ్‌ అంటారు. ఈ క్రమంలో వినియోగదారులు స్పష్టమైన వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మొబైల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్‌ చాలా తక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారు తమ ఫోన్లను వైఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్‌ చేయడం ద్వారా స్పష్టమైన క్వాలిటీతో కాల్స్‌ చేసుకోవచ్చు. దీంతో నెట్‌వర్క్‌ కనెక్టివిటీ, కాల్‌ డ్రాప్‌, కాల్‌ డిస్‌కనెక్ట్‌ సమస్యలు తప్పుతాయి.

దేశంలో మొట్టమొదటిసారిగా ఈ వైఫై కాలింగ్ సర్వీసును ప్రవేశపెట్టిన టెలికాం సంస్థగా భారతీ ఎయిర్‌టెల్ నిలవగా... ఆ తర్వాతి స్థానంలో రిలయన్స్‌ జియో నిలిచింది. ఈ సర్వీసును ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ 10 లక్షల మంది యూజర్లను దాటేసింది. ఈ వైఫై కాలింగ్ సర్వీసును వైఫై నెట్ వర్క్‌ల కోసం ఒక సపరేట్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. దీనిద్వారా కస్టమర్లు వాయిస్ కాల్స్, కాలింగ్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపడేందుకు దోహదపడుతుందని ఎయిర్ టెల్ తెలిపింది. షియోమీ, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, ఆపిల్‌, వివో, టెక్నో, స్పైస్‌, ఐటెల్‌, ఇన్ఫినిక్స్‌, మొబిస్టార్‌, కూల్‌ప్యాడ్‌, జియోనీ, అసుస్‌, మైక్రోమ్యాక్స్‌, జోలో, పానాసోనిక్‌ కంపెనీలకు చెందిన పలు స్మార్ట్‌ఫోన్లలో వినియోగదారులు ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు.

ప్రభుత్వ రంగసంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా అచ్చం వైఫై కాలింగ్‌ తరహాలో వింగ్స్ పేరిట కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. వింగ్స్ సర్వీస్ ద్వారా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు వీవోవైఫై వంటి సర్వీస్‌లను పొందవచ్చు. కానీ మార్కెట్లో ఉన్న వైఫై కాలింగ్ ఫీచర్లకు, దీనికి కాస్త తేడా ఉంది.