క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్లపై పన్ను తొలగించండి

క్యాపిటల్ గెయిన్స్, డివిడెండ్లపై పన్ను తొలగించండి

మరో 20 రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన రెండవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయిన తరుణంలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. ప్రత్యేకించి పన్ను చెల్లింపుదార్లలో - ఆదాయ పన్ను రాయితీలపై ఈ సారి అందరూ గంపెడు ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రతిసారీ ప్రభుత్వాలు తమ బడ్జెట్ ద్వారా పన్ను ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. అయితే ఈసారి ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా ఆదాయం పన్ను రాయితీలు ప్రకటిస్తారన్న ఊహాగానాలు వూపందుకున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతం అందించేందుకు ప్రభుత్వం వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెంచాలంటే, పన్ను ఆదాయం పెంచుకోవడం మినహా వేరే మార్గం లేదు. రుణాల రూపంలో కూడా పెట్టుబడులు చేయవచ్చు. అయితే అది పూర్తిగా బాధ్యతా రాహిత్యం అవుతుంది.

మన దేశంలో ఆదాయం పన్ను చెల్లించేవారి సంఖ్య అతి స్వల్పం కావడం కేంద్ర బడ్జెట్‌ను నిరంతరమూ పీడించే ప్రధాన సమస్య. ప్రస్తుత దేశ జనాభా 137 కోట్లయితే, అందులో ITR-1 రిటర్న్స్ (జీతం ఆదాయం పొందేవారు సమర్పించే రిటర్న్స్) దాఖలు చేసేవారి సంఖ్య కేవలం 3.23 కోట్లు మాత్రమే. ఈ సంఖ్యను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చేసే ప్రయత్నాలు విఫలం అవుతూనే ఉన్నాయి. దీంతో పన్ను ఆదాయం పెంచుకునేందుకు అప్పటికే పన్ను చెల్లించివేసిన ఆదాయంపై మరోమారు పన్ను విధించి, పన్ను చెల్లించని వారి నుంచి పన్ను వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వాలు. 

అలా పుట్టుకు వచ్చినవే డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డిడిటి), క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లు రెండూను. వ్యక్తుల ఆదాయంపై పన్ను వసూళ్లు కష్టతరం కావడంతో సంస్థలు తమ లాభంపై చెల్లించే డివిడెంట్లపై తమ వద్ద నుంచే పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా ఆయా సంస్థలను ప్రభుత్వం ఆదేశిస్తోంది. దీన్నే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్‌గా అభివర్ణిస్తారు. అంటే అప్పటికే తమ లాభాలపై పన్ను చెల్లించినప్పటికీ (కార్పొరేట్ ట్యాక్స్), డివిడెండ్లపై అదనంగా మరోసారి పన్ను విధిస్తున్నారు. ఈ డిడిటి ప్రస్తుతం అన్ని రకాల ఛార్జీలను కలుపుకుంటే 20.56 శాతం అవుతోంది. ఇదంతా ఒకెత్తయితే, 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ డివిడెండ్ అందుకునే వారిపై 10 శాతం అదనపు పన్ను వసూలు చేస్తున్నారు. అంటే ఒకే ఆదాయంపై మూడోసారి పన్ను విధింపు. 

ఇక మ్యూచువల్ ఫండ్స్ పరిస్థితి మరింత దారుణం. ఇక్కడ నాలుగో విడదతగా 12.94 శాతం డివిడెండ్ ట్యాక్స్ చెల్లిస్తాయి ఫండ్స్. ఈసారి బడ్జెట్‌లో అయినా డివిడెండ్లపై పన్నును రద్దు చేయాలని షేర్ హోల్డర్స్ కోరుకుంటున్నారు. స్టాక్స్‌లో నేరుగా లేదా మ్యూచువుల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు చేసేవారి నుంచి తక్కువ రేటులో పన్ను వసూలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా మరిన్ని నిధులు మార్కెట్లలోకి వస్తాయి, దేశీయ సంస్థలు తమ విస్తరణ పథకాలకు అవసరం అయిన సొమ్ము సమకూర్చుకోగలుగుతాయి.

    అదే విధంగా ఈక్విటీ పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (లాంగ్‌టర్మ్) కాలపరిమితిని ఏడాది నుంచి ఐదేళ్ల వ్యవధికి పెంచాలని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈక్విటీ పెట్టుబడులపై లాంగ్‌టర్మ్ అంటే ఏడాది వ్యవధిని, రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై లాంగ్‌టర్మ్ అంటే రెండేళ్ల కాల వ్యవధిని, రుణ సాధనాలు (డెట్) పెట్టుబడులపై లాంగ్‌టర్మ్ అంటే మూడేళ్ల కాలవ్యవధిని కాలపరిమితిగా నిర్ణయించారు.

    ఈ కాలపరిమితి నిర్ణయాలలోనే ప్రధాన లోపం ఉంది. రుణ సాధనాలలో ఇన్వెస్ట్ చేసేవారు స్వల్పకాలిక కాలవ్యవధిని కోరుకుంటారు. వీరు ఏడాది నుంచి రెండేళ్ల కాలవ్యవధిలో తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పునరాలోచన చేస్తారు. ఈక్విటీ-రియల్ ఎస్టేట్ పెట్టుబడులు చేసేవారు దీర్ఘకాల ప్రయోజనాల కోసం ఎదురుచూస్తారు. అంటే కనీసం 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి వీరికి అవసరం. వచ్చే బడ్జెట్‌లో లాంగ్‌టర్మ్, షార్ట్టర్మ్ కాలపరిమితులను ఆయా అసెట్ క్లాసెస్ ప్రాథమిక లక్షణాలకు అనుగుణంగా సవరించడం తప్పనిసరి.

    భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలబడి పన్ను చెల్లిస్తున్న మధ్యతరగతి వర్గం ఏడాదిలై 4 నుంచి 5 నెలలపాటు ప్రభుత్వానికి పన్ను చెల్లించేందుకు పని చేస్తున్నారు. ప్రత్యక్ష-పరోక్ష పన్నులన్నీ కలుపుకుంటే వీరి ఆదాయంలో 40 నుంచి 50 శాతం పన్ను చెల్లింపులకే పరిపోతుంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన నిర్మలా సీతారానమన్‌కు, ఈ కష్టాలు తెలియనివి కావు. రానున్న బడ్జెట్‌లో పన్నుల పీడ  కొంతమేరకైనా సడలించి. తమకు వెసులుబాటు కల్పించాలని మధ్యతరగతి ప్రజానీకం నిర్మలమ్మను వేడుకుంటోంది.
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');