జోరుమీదున్న డెల్టా కార్ప్‌

జోరుమీదున్న డెల్టా కార్ప్‌

నేపాల్‌లో డెల్టా కార్ప్‌ అనుబంధ సంస్థకు కాసినో వ్యాపారం కోసం లైసెన్స్‌ రావడంతో ఇవాళ ఆ కంపెనీ జోరుమీదుంది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 5శాతం లాభపడి రూ.206.60కు చేరింది. ప్రస్తుతం మూడున్నర శాతం పైగా లాభంతో రూ.204.20 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఉదయం 11:12 నిమిషాలకు వరకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి మొత్తం 19 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.5537.98 కోట్లకు పెరిగింది. ఇక ఇండస్ట్రీ పీ/ఈ 36.44 కాగా కంపెనీ పీ/ఈ 30.76గా ఉంది. కంపెనీ బుక్‌ వాల్యూ విషయానికి వస్తే రూ.71.42గా, ఈపీఎస్‌ 6.64గా ఉంది.

గత 3 నెలల్లో ఈ షేర్‌ 20శాతం పైగా లాభపడింది. గత ఏడాది ఏప్రిల్‌ 3న కంపెనీ 52వారాల గరిష్ట స్థాయి రూ.277.75కు చేరింది. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనై గత ఏడాది జూలై 31న రూ.116.05కు పడిపోయింది. లోయర్‌ లెవల్స్‌ నుంచీ కోలుకున్న ఈ షేర్‌ 52వారాల కనిష్ట స్థాయికి 75.53శాతం ఎగువన ట్రేడవుతోంది. ఇక 52వారాల గరిష్ట స్థాయికి ప్రస్తుతం 26.66శాతం దిగువన ఉంది. 

వ్యాపార విస్తరణపై ప్రణాళికలు..
నేపాల్‌లో కాసినో వ్యాపారం నిర్వహించేందుకు గతకొంతకాలం నుంచి డెల్టాకార్ప్‌ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఖాట్మాండులోని మారియట్‌ హోటల్‌లో స్థలాన్ని లీజుకు తీసుకుని  డెల్టాకార్ప్‌ అనుబంధ సంస్థ ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇందులో కాసినో నిర్వహించేందుకు నేపాల్ ప్రభుత్వం నుంచి తాజాగా లైసెన్స్‌ అందుకుంది. త్వరలోనే మారియట్‌ హోటల్‌లో కాసినో ప్రారంభిస్తామని ఈ సందర్భంగా డెల్టా కార్ప్‌ వెల్లడించింది.