ఐపీఓలు నిరాశపర్చినా ఈ స్టాక్స్‌ మాత్రం అదుర్స్‌..

ఐపీఓలు నిరాశపర్చినా ఈ స్టాక్స్‌ మాత్రం అదుర్స్‌..

స్టాక్‌మార్కెట్లలో అస్థిరత పెరిగిపోవడంతో 2019లో ప్రైమరీ మార్కెట్‌ నీరసించింది. 2019లో సెకండరీ మార్కెట్‌ తీవ్ర ఒడిడుదుకులకు లోనవడంతో, ఐపీఓలకు వచ్చేందుకు కంపెనీలు వెనుకంజ వేశాయి. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీల్లో మెజార్టీ సంస్థలు నిరాశపర్చాయి. ఈ ఏడాది మొత్తం 15 స్టాక్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు రాగా... అందులో కేవలం 7 కంపెనీలు మాత్రమే రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. 

ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు, యూఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌, రూపాయి బలహీనంతో గత కొద్ది నెలలుగా ఐపీఓల హవా తగ్గిపోయింది. పలు కంపెనీలు తమ ఐపీఓ ప్రతిపాదనను వాయిదా వేసుకోగా... మొత్తం 15 కంపెనీలు మాత్రమే ఐపీఓకు వచ్చాయి. ఇందులో స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌, ఎంఎస్‌టీలు లిస్టింగ్‌ తొలిరోజే చెత్త ప్రదర్శనను నమోదు చేశాయి. 

ఐఆర్‌సీటీసీ అదుర్స్‌..
ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్లకు లాభాలను పంచాయి. ఈ ఏడాది అక్టోబర్‌ 14న లిస్టైన  రైల్వేలకు ఏకైక క్యాటరింగ్‌, టికెట్‌ ప్రొవైడర్‌ అయిన్‌ ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) మాత్రం తొలిరోజూ 101.3శాతం లాభాలను అందించి ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తింది. రూ.645 కోట్ల నిధుల సమీకరణ కోసం సెప్టెంబర్‌ 30 - అక్టోబర్‌ 3 మధ్య వచ్చిన ఈ ఇష్యూ 112 రెట్లు ఓవర్‌సబ్స్క్రైబ్‌ అయింది. దీంతో ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీల్లో ఇది మల్టీ బ్యాగర్‌ అయింది. 2019లో ఈ స్టాక్‌ 172శాతం ర్యాలీ చేసింది. రైల్వేయేతర క్యాటరింగ్‌, ఈ-క్యాటరింగ్‌, ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌లు, బడ్జెట్‌ హోటల్స్‌ వంటి సేవలతో పాటు ఇతర వ్యాపారాలతో ఐఆర్‌టీసీసీ వ్యాపారం వైవిధ్యభరితంగా ఉంది. దేశంలోని రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్‌ సేవలు అందించడం, ఆన్‌లైన్ టికెట్లు, ప్యాకేజీ డ్రింకింగ్‌ వాటర్‌ వంటి సేవలను ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. 

లాభాల పంట పండించిన స్టాక్స్‌.. 
ఇక ఈనెల్లో వచ్చిన ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనుబంధ సంస్థ ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. డిసెంబర్‌ 12న లిస్టైన ఈ కంపెనీ తొలిరోజు ఇన్వెస్టర్లకు 56.8 శాతం లాభాలను అందించింది. డిసెంబర్‌ 2-4 వరకు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన ఈ కంపెనీ రూ.750 కోట్ల నిధులను సమీకరించింది. ఇష్యూ 165.68 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. మాస్‌ మార్కెట్‌కు ఇప్పటివరకు సేవలందించిన ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీకు తక్కువ వృద్ధి నమోదయ్యే రంగాలపై చాలా చక్కని అవగాహన ఉందని మార్కెట్‌ ఎనలిస్టులు భావిస్తున్నారు. 

ఇక కేరళాకు చెందిన ప్రైవేట్‌ రంగ సంస్థ సీఎస్‌బీ బ్యాంక్‌(క్యాథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌) కూడా లిస్టింగ్‌ రోజు రెండంకెల రిటర్న్స్‌ ఇచ్చిన మూడో సంస్థగా నిలిచింది. డిసెంబర్‌ 4న 41శాతం ప్రీమియంతో రూ.275 వద్ద లిస్టైంది. అయితే అనూహ్యంగా ఇన్వెస్లర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో ఈ సంస్థ లాభాలు కొంతమేర తగ్గినప్పటికీ ఇప్పటికీ 14శాతం రిటర్న్స్‌ను ఇన్వెస్టర్లకు అందించింది. రూ.410 కోట్ల నిధులను సమీకరణ కోసం నవంబర్‌ 22-26 మధ్య పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన ఈకంపెనీ 87 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. ఇక మిగిలిన షేర్లలో అప్లే ఇండియా, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, నియోజెన్‌ కెమికల్స్‌, పాలిక్యాబ్‌ ఇండియాలు లిస్టింగ్‌ తొలిరోజూ రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఈ స్టాక్స్‌ ఇష్యూ ధర కన్నా 16.7-24.8 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. 

ఇయర్‌ టు డేట్‌ ప్రకారం చూస్తే 2019లో ఇండియా మార్ట్‌ 114.5శాతం, అప్లే ఇండియా 98 శాతం, పాలిక్యాబ్‌ ఇండియా 84శాతం, నియోజెన్‌ కెమికల్స్‌ 63 శాతం రిటర్న్స్‌తో ఈ ఏడాది మల్టీ బ్యాగర్స్‌గా నిలిచాయి. 

నిరాశపర్చిన స్టాక్స్‌ ఇవే..
ఏదేమైనా స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌, స్పందన స్ఫూర్తీ ఫైనాన్షియల్‌, ఎంఎస్‌టీసీలు లిస్టింగ్‌ తొలిరోజూ నిరాశజనక ప్రదర్శనను నమోదు చేశాయి. ఈ స్టాక్స్‌ వరుసగా 10.3శాతం, 3.7శాతం, 7.5శాతం నష్టపోయాయి. ఇంజనీరింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అయిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్ ఈ ఏడాది అత్యధికంగా నష్టపోయిన స్టాక్‌గా నిలిచింది. ప్రమోటర్లు అప్పులు తిరిగి చెల్లించడంలో విఫలం కావడం, అధిక వాల్యుయేషన్స్‌తో ఈ ఏడాది ఈ స్టాక్‌ 63 శాతం నష్టపోయింది. మరోవైపు లిస్టింగ్ తొలిరోజూ నిరాశపర్చినప్పటికీ స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ 39శాతం, ఎంఎస్‌టీసీ 16శాతం లాభంతో రెండంకెల రిటర్న్స్‌ను అందించాయి.