గోల్డ్ క్రాస్‌లో ఇండెక్స్.. దలాల్ స్ట్రీట్‌ దశ తిరగనుందా

గోల్డ్ క్రాస్‌లో ఇండెక్స్.. దలాల్ స్ట్రీట్‌ దశ తిరగనుందా
ఎమర్జింగ్ మార్కెట్ ఈక్విటీలు ఈ ఏడాది వరుసగా రెండో సారి కూడా గోల్డెన్ క్రాస్‌ను తాకాయి. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఏడాదిలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ.. మెరుగైన పనితీరును కనబరుస్తాయని అంచనా వేస్తున్నారు.


ఏంటీ గోల్డెన్ క్రాస్
ఎప్పుడైతే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్... లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్‌ను క్రాస్ చేసి పైన ఉంటుందో.. దాన్ని మనం గోల్డెన్ క్రాస్ అంటాం. ఇది బుల్లిష్ టెక్నికల్ ప్యాటర్న్‌కు సంకేతంగా భావించాలి.

తాజా గోల్డెన్ క్రాస్‌లో 50 రోజుల మూవింగ్ యావరేజ్ (ఎంఎస్‌సీఐ ఇండెక్స్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్)1038ని తాకింది. అదే 200 రోజల మూవింగ్ యావరేజ్ 1033 దగ్గరే ఉంది. ఈ బ్లూమ్‌బర్గ్ డేటాను పరిశీలిస్తే.. లాంగ్ టర్మ్‌తో పోలిస్తే.. షార్ట్ టర్మ్ యావరేజ్ ఎక్కువగా ఉంది. మార్చి నెలలో ఇదే తరహాలో ఈఎం ఇండెక్స్ సుమారు 6 శాతం లాభపడింది. పదిహేను రోజుల క్రితం సెన్సెక్స్, నిఫ్టీలు కూడా గోల్డెన్ క్రాస్ ఫార్మేషన్‌ను చూశాయి.


నిలబడ్తుందా..
అయితే ఈ ప్యాటర్న్ నిలబడి, స్థిరపడి ముందుకు సాగడానికి కొన్ని ఫ్యాక్టర్స్ కారణమవుతాయి. అందులో ముఖ్యంగా అమెరికా - చైనా మధ్య ట్రేడ్ డీల్, సెంట్రల్ బ్యాంక్స్ కామెంటరీ, ఆర్థిక ఉద్దీపనలు వంటివి మద్దతునిస్తాయి.

సాధారణంగా మెరుగైన పనితీరును కనబర్చే మార్కెట్లే ఎక్కువ నిధులను ఆకర్షిస్తాయి. ఇప్పుడు మోర్గాన్ స్టాన్లీ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్‌తో పోలిస్తే భారతీయ ఈక్విటీ మార్కెట్లు ఔట్ పర్ఫార్మ్ చేశాయి. 2019లో ఇప్పటి వరకూ ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు 13.3 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఇన్వెస్ట్ చేశాయి. చైనాను మినహాయిస్తే గత ఐదేళ్లలో ఇతర ఎమర్జింగ్ మార్కెట్లతో పోలిస్తే ఇదే అత్యధికం.
 


ఇండియన్ స్టాక్స్‌లో 200 డీఎంఏపైన కదలాడుతున్న స్టాక్స్ ఇప్పుడు 46 శాతంగా ఉన్నాయి. వీటికి తోడు నిఫ్టీ ఆర్ఎస్ఐ(రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్) 53గా ఉంది. ధరల్లో తాజాగా వచ్చిన మార్పులను సూచించేందుకు ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఉపయోగపడ్తుంది. ఒకవేళ ఆర్ఎస్ఐ 70పైన ఉంటేనే ఓవర్ బాట్, 30 కింద ఉంటే ఓవర్ సోల్డ్ అని భావిస్తారు.  అయితే ఆర్ఎస్ఐ 70పైన ఉన్న స్టాక్స్ కేవలం 4 మాత్రమే ఉన్నాయి.