ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌లో ర్యాలీ 

ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌లో ర్యాలీ 

నిధుల సేకరణ వార్తలతో ఇవాళ రిటైల్‌ ఫోకస్డ్‌ అఫర్డబుల్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌లో ఊహించని ర్యాలీ కనిపిస్తోంది. ఇవాళ జరుగుతోన్న బోర్డుమీటింగ్‌లో ఎన్‌సీడీల ద్వారా నిధుల సేకరణ అంశాన్ని కంపెనీ పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇంట్రాడేలో ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ 6 శాతం పైగా లాభపడి సరికొత్త రికార్డ్‌ స్థాయి రూ.1,949కు చేరింది. ఈనెల 2న నెలకొల్పిన ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి (రూ.1880)ని ఇవాళ అధిగమించింది. ఇక ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అవాస్‌ ఫైనాన్షియర్స్‌ జోరుమీదుంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.851గా ఉన్న ఈ స్టాక్‌ ప్రస్తుతం బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ కన్నా పది రెట్లు అధికంగా అంటే 130 శాతం రిటర్న్స్‌ అందించింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 13శాతం మాత్రమే పెరిగింది. 

ప్రతి త్రైమాసికంలోనూ క్రమంతప్పకుండా అవాస్‌ ఫైనాన్షియర్స్‌ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో నికరలాభం 86 శాతం వృద్ధితో రూ.121 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) ఇదే సమయంలో 39 శాతం వృద్ధితో రూ.251 కోట్లకు చేరింది. కంపెనీ ఏయూఎం 42 శాతం వృద్ధితో రూ.1759 కోట్ల నుంచి రూ.6753 కోట్లకు చేరింది. జీఎన్‌పీఏ లెవల్స్‌ను ఒకశాతం దిగువగా, ఆర్‌ఓఏ 2.5శాతం కంటే అధికంగా ఉండేలా తాము ప్లాన్‌ చేస్తున్నట్టు కంపెనీ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రుణాల వితరణ భారీగా పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కంపెనీ వెల్లడించింది.