కొనసాగుతోన్న అరామ్‌కో జోరు

కొనసాగుతోన్న అరామ్‌కో జోరు

సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్‌ దిగ్గజం అరామ్‌కో జోరు వరుసగా రెండో రోజూ కొనసాగుతోంది. నిన్న రియాద్‌ స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన ఈ కంపెనీ తొలిరోజే ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించింది. ఇక ఇవాళ ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ను అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అరామ్‌కో షేర్ ధర వరుసగా రెండో రోజు 10% పెరిగి, ప్రీ-మార్కెట్ సెషన్‌లో 38.7 రియాల్స్ (10.32 డాలర్లు)ను తాకింది. లిస్ట్‌ అయిన రెండో రోజే ప్రపంచంలోనే ఇలాంటి మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అరామ్‌కో నిలిచింది. 

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన అరామ్‌కో బుధవారం మార్కెట్లో లిస్టై ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచెత్తింది. తొలిరోజే 10శాతం రిటర్న్స్‌ అందించడంతో మార్కెట్‌ క్యాస్‌ 1.88 లక్షల కోట్లకు చేరింది. ఇష్యూ ధర 32 సౌదీ రియాల్స్‌(8.53 డాలర్లు) కాగా తొలిరోజే 10 శాతం ధర పెరగడంతో 35.2 రియాల్స్‌కు పెరిగింది. వరుసగా రెండోరోజూ జోరు కొనసాగడంతో ఇవాళ 38.7 రియాల్స్‌కు చేరింది. దీంతో ప్రస్తుతం అరామ్‌కో మార్కెట్‌ విలువ మైక్రోసాఫ్ట్‌, యాపిల్‌ కన్నా అధికంగా ఉంది. 

ప్రపంచంలో అతిపెద్ద ఐపీఓగా పేరొందిన ఈ పబ్లిక్‌ ఆఫర్‌తో కంపెనీ 2560 కోట్ల డాలర్లు (దాదాపుగా రూ.1.79 లక్షల కోట్లు) సమీకరించింది. లిస్టింగ్‌తో 1.88 లక్షల కోట్ల డాలర్లకు చేరిన ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ తాజా 2 లక్షల కోట్ల డాలర్లను అధిగమించింది. దీంతో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా సౌదీ అరామ్‌కో అవతరించింది. దీంతో ప్రపంచ మార్కెట్లలో సౌదీ మార్కెట్‌ 9వ అతిపెద్దదిగా మారింది. ప్రస్తుత ఐపిఒలో సౌదీ అరామ్‌కో కేవలం 1.5 శాతం వాటాను విక్రయించింది. మిగిలిన వాటా సౌదీ చేతిలో ఉంది.