కార్వీ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసిన ఎన్‌ఎస్‌ఈ

కార్వీ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసిన ఎన్‌ఎస్‌ఈ

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గతవారం కార్వీ సంస్థపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించగా.. తాజాగా ట్రేడింగ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేస్తూ ఎన్‌ఎస్‌ఈ నిర్ణయం తీసుకుంది. రెండు వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్టుగా అనుమానిస్తున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్ లిమిటెడ్‌ లైసెన్స్‌ను బీఎస్‌ఈ, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ, ఎంఎస్‌ఈఐలు కూడా రద్దు చేశాయి. అన్ని విభాగాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్టాక్‌ ఎక్స్ఛేంజీలు తెలిపాయి. సెబీ విధించిన పలు మార్గదర్శకాలను పాటించని కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు, ఇతర అవసరాలకు వినియోగించినట్లు గుర్తించడంతో గత నెల 22న సెబీ చర్యలు తీసుకుంది. అలాగే కొత్త ఖాతాదారులను తీసుకోకుండా సెబీ ఆంక్షలు విధించింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ఖాతాదాలకు సంబంధించిన పవర్‌ ఆఫ్‌ ఆటార్నీపై కూడా ఆంక్షలు విధించింది. దీంతోపాటు కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌పై ఎక్స్ఛేంజీలుక్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇటీవలే నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ తనిఖీలు నిర్వహించింది. కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్ రూ.1096 కోట్లను తన అనుబంధ సంస్థ అయిన కార్వీ రియాల్టీకి ఏప్రిల్‌ 2016 నుంచి అక్టోబరు 2019 మధ్య బదిలీ చేసిందని ఆ తనిఖీలో తేలింది. ఇంకా క్లయింట్లకు చెందిన ఖాతాల్లో పలు అవకతవకలకు పాల్పడ్డట్లు తేలింది. తొమ్మిది మంది క్లయింట్లకు చెందిన రూ.485 కోట్ల డీపీ ఖాతాలో లేని అదనపు సెక్యూరిటీలను విక్రయించింది. అంతే కాకుండా.. మే 2019 వరకు ఈ తొమ్మిది మంది క్లయింట్లలో ఆరుగురికి చెందిన రూ.162 కోట్ల విలువైన అదనపు సెక్యూరిటీలను బదిలీ చేసింది. నలుగురు క్లయింట్లకు చెందిన రూ.257.08 కోట్ల విలువైన సెక్యూరిటీలను తనఖా పెట్టారు. అయితే జూన్‌-ఆగస్టు 2019లో మధ్య ఆ షేర్లను తనఖా నుంచి విడిపించుకున్నప్పటికీ అందులో రూ.217.85 కోట్ల విలువైన షేర్లను కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ చేసుకుంది.2019లో ఆ తొమ్మిది మంది క్లయింట్లకు చెందిన ఖాతాల్లో ఐదుగురి నుంచి రూ.228.07 కోట్ల విలువైన షేర్లను కేఎస్‌బీఎల్‌ కొనుగోలు చేసింది. 156 క్లయింట్లు ఒక్క ట్రేడ్‌ కూడా నిర్వహించనప్పటికీ వారి నుంచి రూ.27.8 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేసింది. జూన్‌ 2019 నుంచీ కేఎస్‌బీఎల్‌తో ఎటువంటి ట్రేడింగ్‌ నిర్వహించనప్పటికీ 291 క్లయింట్ల నుంచి రూ.116.3 కోట్ల షేర్లను బదిలీ చేశారు.