రిలయన్స్‌ విజయ ప్రస్థానం ఎక్కడ మొదలైదంటే..!

రిలయన్స్‌ విజయ ప్రస్థానం ఎక్కడ మొదలైదంటే..!

స్టాక్‌ మార్కెట్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సరికొత్త రికార్డును క్రియేట్‌ చేసింది. రూ.10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను అధిగమించిన తొలి దేశీయ కంపెనీగా రికార్డ్‌ సృష్టించింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 40శాతం పైగా రిటర్న్స్‌ అందించిన రిలయన్స్‌... మరిన్ని రికార్డులను నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది.

మార్కెట్ రారాజుగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొంత కాలంగా జోరుమీదుంది. ఏ కంపెనీకి సాధ్యం కానంతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అద్వితీయ విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. టార్గెట్‌ను అందుకునే క్రమంలో అబ్బురపరిచే ఫలితాలను నమోదు చేస్తోంది. గత 40రోజుల విషయాన్నే తీసుకుంటే లక్ష కోట్ల రూపాయల మార్కెట్‌ క్యాపిటల్‌ పెరిగింది. అక్టోబరు 18న 9 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న రియలన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ నవంబర్‌ 28న 10 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకింది.

ఒక్కో మెట్లు ఎక్కుతూ..
2005 ఆగస్ట్‌ 2న రూ.1.03 లక్షల కోట్లుగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్ మార్కెట్‌ క్యాప్‌ ఆ తర్వాత రెండేళ్లలో అంటే 2007 ఏప్రిల్‌ 16న రూ.2లక్షల కోట్ల మార్కును అధిగమించింది. అదే ఏడాది సెప్టెంబర్‌ 19న రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.3 లక్షల కోట్లు, అక్టోబర్‌ 29న రూ.4లక్షల కోట్ల మార్కును అధిగమించి మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ఆ తర్వాత లేమాన్‌ బ్రదర్స్‌ సంక్షోభంతో ప్రపంచ మార్కెట్లన్నీ ఢీలా పడ్డాయి. దీంతో రిలయన్స్‌ కూడా అదే బాటలో పయనించింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి మెజార్టీతో ఎన్‌డీఏ సర్కార్‌ కొలువుదీరటంతో దేశీయ మార్కెట్లను ఉత్సాహపరిచాయి. ముఖ్యంగా ఈ సమయంలో హెవీ వెయిట్‌ స్టాక్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు సైతం ఒక్కసారిగా కొనుగోళ్ళ మద్దతు లభించింది. దీంతో 2017 జూలై 21న రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.5 లక్షల కోట్లను అధిగమించింది. అదే ఏడాది నవంబర్‌ 1న రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.6 లక్షల కోట్లు దాటింది. 

జియోతో తిరిగిన దశ..
ఇక జియో ఆగమనంతో భారత వ్యాపార చరిత్రలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జోరు ఆమాంతం పెరిగింది. అత్యధిక లాభాలు, టెలికాం టారీఫ్‌ల పెంపు, గ్యాస్‌ ఉత్పత్తి మొదలవ్వడం, తక్కువ మూలధన వ్యయం వంటి అంశాలు ఈ కంపెనీకి బూస్టింగ్‌లా పనిచేశాయి. దీంతో గత 17 నెల్లలోనే రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.3లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.10 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించింది. ముఖ్యంగా గత నెల రోజుల్లో మార్కెట్‌ క్యాప్‌ రూ.లక్ష కోట్లకు పైగా పెరిగింది. రిలయన్స్‌ అక్టోబర్‌ 18వ తేదీన రూ.9లక్షల కోట్ల మార్కెట్‌ విలువను చేరుకొంది. అప్పటి నుంచి షేరు ధర పెరుగుతూ వస్తోంది. గతవారం రూ.9.5లక్షల కోట్ల మార్కెట్‌ విలువను  దాటింది. చూస్తుండగానే ఈ వారం చివరికి వచ్చేసరికి రూ.10లక్షల కోట్ల మార్కును అలవోకగా దాటేసింది. ఇక రిలయన్స్‌ తర్వాతి స్థానంలో ఉన్న టీసీఎస్‌కు మార్కెట్‌ విలువలో దాదాపు రూ.2లక్షల కోట్ల వ్యత్యాసం ఉంది.