స్టాక్ మార్కెట్లో రికార్డ్ బ్రేకింగ్ కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లకు మాత్రం కొనుగోళ్ళ మద్దతు లభిస్తోంది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 41,100 ఎగువన ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 12100 ఎగువన కొనసాగుతోంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా తొలిసారిగా 32వేల మార్కును అధిగమించింది. ప్రస్తుతం 240 పాయింట్ల లాభంతో 32110 ఎగువన కదలాడుతోంది.
నిఫ్టీ టాప్ గెయినర్స్ విషయానికి వస్తే భారతి ఎయిర్టెల్ 9.59 శాతం, యూపీఎల్ 4.56 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3.54 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.48 శాతం, టాటా స్టీల్ 2.04 శాతం లాభంతో ఉన్నాయి. జీ ఎంటర్టైన్మెంట్ 2.13శాతం, టాటా మోటార్స్ 1.05 శాతం, హెచ్డీఎఫ్సీ 0.78 శాతం, హీరోమోటోకార్ప్ 0.74 శాతం, ఒఎన్జీసీ 0.68 శాతం నష్టంతో నిఫ్టీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎస్బీఐ, జీ ఎంటర్టైన్మెంట్, భారతి ఎయిర్‌టెల్‌లు చురుగ్గా కదలాడుతోన్నాయి.