ప్రైవేట్‌ చేతుల్లోకి ఎయిర్‌ ఇండియా?

ప్రైవేట్‌ చేతుల్లోకి ఎయిర్‌ ఇండియా?

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ఎయిర్‌ఇండియాను ఇక గట్టెక్కించడం తమవల్ల కాదని ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రైవేటీకరణపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. ఎయిర్‌ ఇండియా అమ్ముడుపోకపోతే మూసివేయడమే మంచిదని భావిస్తోంది.

ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది.  ప్రైవేటీకరణ కోసం త్వరలో చేస్తున్న మరో ప్రయత్నం విఫలమైతే నిర్వహణ కష్టమేనని ప్రభుత్వం భావిస్తోంది. భారీ నష్టాలతో నడిపే కంటే మూసివేయడమే మంచిదనే యోచనలో ఉన్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

భారీ అప్పులు..
ప్రస్తుతం ఎయిర్ ఇండియాకి ఉన్న అప్పులు వేల కోట్ల రూపాయలకు చేరాయి. సాధారణంగా విమానయాన రంగంలో ఆర్థికస్థితి దెబ్బతిని, కార్యకలాపాలు నిలిపివేసిన సంస్థ కోలుకోవడం దాదాపు అసంభవమే. కింగ్ ఫిషర్ , జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇలానే మూత పడ్డాయి. పాతికేళ్లకుపైగా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో సేవలందించిన జెట్‌ విమానాలు నిలిచిపోవడం ఎయిరిండియాకు కలిసివస్తోంది. అయినా కూడా ఎయిరిండియాలో పెట్టుబడి పెట్టడానికి కేంద్రం సుముఖంగా లేదు. గత 5 ఏళ్ళుగా అందించిన నిధులు వల్ల ఎయిర్ ఇండియా కాస్త కోలుకున్నా.. ఆర్ధిక స్థితి మాత్రం ఇంకా అంతంత మాత్రం గానే ఉంది. 

వాటా విక్రయంపై కేంద్రం దృష్టి..
ఏడాదిన్నర క్రితం కూడా మోడీ ప్రభుత్వం ఎయిర్‌ ఇండియా ఈక్విటీలో 76 శాతం వాటాను అమ్మకానికి పెట్టింది. అయితే కంపెనీ అప్పులు, నష్టాలు చూసి ఏ కంపెనీ కూడా ఎయిర్‌ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. అయితే వచ్చే మార్చినాటికి ఎలాగైనా ఎయిర్‌ ఇండియాను వదిలించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలను ఆకర్షించేందుకు కంపెనీ ఈక్విటీలో పూర్తి వాటాను అమ్ముతామని ప్రకటించింది. దీనికి తోడు కంపెనీకి ఉన్న దాదాపు రూ.78,450 కోట్ల అప్పుల్లో రూ.50,000 కోట్ల అప్పుల్ని మినహాయిస్తోంది. ప్రైవేటీకరిస్తే ఉద్యోగాలు పోతాయని భయపడుతున్న ఉద్యోగుల్ని సముదాయించేందుకూ చర్యలు చేపట్టింది. 

మరోవైపు జెట్ ఎయిర్ వేస్ కుప్పకూలాక, ఆక్యుపెన్సీ విషయంలో ఎయిర్ ఇండియాకు మంచి అవకాశం దక్కింది. అలాగే ఇతర రూట్ల పర్మిట్లను కూడా ఎయిర్ ఇండియా క్యాష్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రయత్నాలకు కేంద్రం మోకాలొడ్డుతుందని ఎయిర్ ఇండియా ఉద్యోగులు అంటున్నారు.