కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, ఏ రంగంపై ఎలాంటి ప్రభావం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, ఏ రంగంపై ఎలాంటి ప్రభావం

కేంద్ర కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. టెలికాం ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఇబ్బందులు సహా సామాన్యులు ఎదుర్కొంటున్న ఉల్లి సమస్యల వరకూ ప్రతీ అంశంపైనా విస్తృత చర్చ జరిపింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వ నిర్ణయాలు ఇవీ. 

రూ. లక్ష కోట్లే లక్ష్యం

డిజిన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలైన భారత్ పెట్రోలియం, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మెజార్టీ వాటాలను అలానే కంటైనర్ కార్పొరేషన్‌లో 31 శాతం వాటాలను అమ్మాలని నిర్ణయించింది. 
ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లను పరిగణలోకి తీసుకుంటే ఈ వాటాల అమ్మకం ద్వారా కేంద్రం రూ.78400 కోట్లను సమీకరించాలని చూస్తోంది. 
వీటితో పాటు తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్, నార్త్ ఈస్ట్రన్ పవర్ కార్పొరేషన్‌లను పూర్తిగా అమ్మేయాలని ప్రధాని అధ్యక్షతన సాగిన కాబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ ఎఫైర్స్ నిర్ణయం తీసుకుంది.

ఈ ఆర్థిక ఏడాదిలో మొత్తం రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే ఇప్పటివరకూ (సెప్టెంబర్) కేంద్రం రూ.12359 కోట్లను మాత్రమే పూర్తి చేయగలిగింది. 

బిపిసిఎల్‌లో 53.3 శాతం వాటా అమ్మకం ద్వారా రూ.63 వేల కోట్లు, షిప్పింగ్ కార్పొరేషన్‌లో 63.7 శాతం వాటా అమ్మకం వల్ల రూ.2 వేల కోట్లు, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 30.8 శాతం వాటా ద్వారా రూ.13400 కోట్లను కేంద్రం సమీకరించాలని నిర్ణయించింది. 

టెలికాం సంస్థలకు ఊరట
ఇబ్బందుల్లో ఉన్న టెలికాం సంస్థలకు కొద్దో గొప్ప ఊరట కలిగించింది కేంద్రం. స్పెక్ట్రం బకాయిల చెల్లింపులపై రెండేళ్ల మారటోరియం విధించాలని నిర్ణయించింది.  గతంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రం బకాయిలను ఏడాది చొప్పున దశలవారీగా సంస్థలు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల నేపధ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వారికి కలిసొస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం వొడాఫోన్ రూ.23920 కోట్లు, ఎయిర్టెల్ రూ.11746 కోట్లు, రిలయన్స్ జియో రూ.6670 కోట్లు కేంద్రానికి బకాయి పడింది. ఈ మొత్తం సొమ్ము రూ.42336 కోట్లుగా ఉంది. 

రెండేళ్ల మారటోరియాన్ని తీసుకోవాలని అనుకుంటున్న టెలికాం సంస్థలకు అందుకు సంబంధించి బ్యాంక్ గ్యారెంటీని మాత్రం సమర్పించాల్సి ఉంటుంది.