వోడా ఐడియా, ఎయిర్టెల్‌కు మరో లైఫ్ లైన్ ! కష్టాలు తీరినట్టేనా

వోడా ఐడియా, ఎయిర్టెల్‌కు మరో లైఫ్ లైన్ ! కష్టాలు తీరినట్టేనా

వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు ఎట్టకేలకు ధైర్యంగా ముందడుగు వేశాయి. ఇక ఎంతకాలం చస్తూ.. బతుకుతూ.. నిత్యం పోరాటం చేస్తామనే భావనకు వచ్చాయో ఏమో తెలీదు కానీ.. రెండు సంస్థలూ ఓ నిర్ణయానికి వచ్చాయి. అప్పుల భారం, పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వంపైనే పూర్తిగా ఆధారపడకుండా... ఛార్జీలను పెంచుకోవాలని భావించాయి. ఈ నేపధ్యంలో త్వరలో రేట్లు పెంచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి ఇరు సంస్థలూ. ఇదే బాటలో రిలయన్స్ జియో కూడా సిద్ధమవుతోంది. 

జియో దెబ్బకు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్ సంస్థలు ఏ స్థాయిలో ఇబ్బందులు పడ్తున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. విపరీతమైన కాంపిటీషన్ నేపధ్యంలో అన్ని టెలికాం సంస్థలూ నష్టాల భారాన్ని భరిస్తున్నాయి. పోటీతత్వం పెరిగిపోయి లాభాలకు బదులు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. చివరకు తాము కంపెనీని లిక్విడేట్ చేసేందుకు కూడా వెనుకాడబోమని వోడాఫోన్ సంస్థ ప్రకటించడం కొద్దిగా ఇండస్ట్రీలో కాకరేపింది. ఒక వేళ అదే జరిగితే సుమారు లక్షన్నర కోట్లు అప్పు ఇచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మునిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడ్తూ వోడాఫోన్ యాజమాన్యం చేసిన ప్రకటన.. అటు ఇండస్ట్రీలో ఇటు ప్రభుత్వంలో కొద్దిగా చలనం కలిగించింది. 

అయితే ఈ లోపు ప్రభుత్వంపైనే పూర్తిగా ఆధారపడకుండా తాము కూడా తమ ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఎయిర్టెల్, వోడాఐడియా సిద్ధమయ్యాయి. టారిఫ్ రేట్లను పెంచబోతున్నట్టు ప్రకటించాయి. ఇండస్ట్రీ నిపుణుల అంచనా ప్రకారం రేట్లు పదిహేను నుంచి ఇరవై శాతం వరకూ పెరగొచ్చని భావిస్తున్నారు. 
ఎందుకంటే గతంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ (ఒక్కో కనెక్షన్ పై సగటు ఆదాయం) స్థిరంగా ఉండేది. 2016లో రూ.198 ఉన్న ఎయిర్టెల్ (ARPU) ఇప్పుడు రూ.128కి తగ్గింది. ఐడియాకు రూ.107, జియోకు రూ.120 వరకూ ఉంది. గతంతో పోలిస్తే భారీ స్థాయిలో ఆదాయం, సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోవడంతో ఈ సంస్థల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఇక ధైర్యం చేసి డిసెంబర్ 1 నుంచి టారిఫ్ రేట్లలోల మార్పులు చేయబోతున్నాయి ఎయిర్టెల్, ఐడియా.

అయితే ఇదే సమయంలో రిలయన్స్ జియోకు కూడా ముందడుగు వేసింది. తానూ ఇదే బాటలో నడుస్తానని చెబ్తోంది. అయితే ఇండియా నుంచి 2జీ పూర్తిగా తీసివేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. 2జీ ముక్త్ భారత్ చేయాలంటూ చెబ్తోంది. అయితే వోడా, ఎయిర్టెల్ కు మాత్రం ఇప్పటికీ భారీ సంఖ్యలో  2జీ కస్టమర్లు ఉన్నారు. 

కంపెనీల కష్టం గట్టెక్కిందా
ప్రస్తుతానికి టారిఫ్‌లు పదిహేను ఇరవై శాతం పెంచడం వల్ల ఈ రెండు సంస్థల లాభదాయకత గణనీయంగా పెరుగుతుందని భావించలేం. కొద్దో గొప్పో ఆదాయం పెరగొచ్చు, అదే సమయంలో సంస్థల నెత్తిన ఉన్న రుణభారం తగ్గే అవకాశం కూడ లేదు. ఈ నేపధ్యంలో రిలయన్స్ మినహా ఎయిర్టెల్, ఐడియాలను పెరిగినప్పుడల్లా మెల్లిగా వదిలించుకోవడమే బెస్ట్ అనేది నిపుణుల సలహా. జియో ARPUలు పెరగడంతో పాటు భవిష్యత్తులో మరింత మంది కస్టమర్లు ఇటువైపు మళ్లే ఆస్కారం ఉండడంతో ఈ స్టాక్ దూసుకుపోతోంది.