రూ.10 లక్షల కోట్లకు చేరువలో రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌

రూ.10 లక్షల కోట్లకు చేరువలో రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ జోరు కొనసాగుతోంది. ఇవాళ ఇంట్రాడేలో 3శాతం పైగా లాభపడి బిఎస్‌ఇలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ.1,508.45ని తాకింది. ఇంతకుముందు ఈ గతనెల 31న ఆర్‌ఐఎల్‌ రూ.1490 మార్కును నమోదు చేసింది. దీంతో ఇవాళ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రూ .9.50 ట్రిలియన్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను దాటిన మొదటి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌ఐఎల్‌కు మార్కెట్ క్యాప్ రూ .9.54 ట్రిలియన్లుగా ఉందని బిఎస్‌ఇ డేటా ఆధారంగా తెలుస్తోంది. 

అక్టోబర్ 18న 9 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన మొదటి సంస్థగా ఆర్‌ఐఎల్ నిలిచింది. ఎస్&పి బిఎస్ఇ సెన్సెక్స్‌ 12 శాతం పెరుగుదలతో పోలిస్తే, 2019 క్యాలెండర్ సంవత్సరంలో ఆర్ఐఎల్ యొక్క స్టాక్ ధర 34 శాతం పెరిగింది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో కంపెనీ మార్కెట్ క్యాప్ ఇప్పటివరకు రూ .2.3 ట్రిలియన్లు పెరిగింది.

జోరుమీదున్న టెలికాం షేర్లు..
వచ్చే నెల నుంచి సుంకాలను పెంచాలని టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు వోడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లు నిర్ణయించాయి. దీంతో ఇవాళ టెలికాం స్టాక్స్‌ జోరు మీదున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ టెలికాం రంగంలోకి ప్రవేశించిన తర్వాత టారిఫ్‌లు పెరగడం ఇదే తొలిసారి. 

మొబైల్ డేటా సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతూ ఉన్నప్పటికీ, భారత్‌లో మొబైల్ డేటా ఛార్జీలు ప్రపంచంలోనే అత్యంత చౌకని, తమ కస్టమర్లు ప్రపంచ స్థాయి డిజిటల్ అనుభవాలను ఆస్వాదిస్తూనే ఉన్నారని వొడాఫోన్‌ ఐడియా వెల్లడించింది. వచ్చేనెల 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమల్లోకి రానున్నయని తెలిపింది. టెలికాం రంగంలో తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని షేర్‌ హోల్డర్లందరూ గుర్తించారని వోడాఫోన్‌ ఐడియా తెలిపింది. కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కార్యదర్శుల కమిటీ (CoS) తగిన ఉపశమనం కల్పించే దిశగా చూస్తోందని వొడాఫోన్‌ ఐడియా ప్రతినిధులు తెలిపారు.