ఉన్నట్టుండి డీజిల్ బ్రిజా కార్‌కు భలే డిమాండ్ ! ఎందుకంటే

ఉన్నట్టుండి డీజిల్ బ్రిజా కార్‌కు భలే డిమాండ్ ! ఎందుకంటే

మారుతి సుజుకి తయారు చేస్తున్న విటారా బ్రెజా, డిజైర్ డీజిల్ కార్లకు ఉన్నట్టుండి ఎక్కడలేని డిమాండ్ పుట్టుకొచ్చింది. గత కొద్ది నెలలతో పోలిస్తే వీళ్లను అడుగుతున్న వారి సంఖ్య దాదాపుగా రెట్టింపు అయింది. ఇప్పుడు విటారా బ్రిజా డీజిల్ కార్లు నెలకు 13 వేల నుంచి 14 వేల వరకూ అమ్ముడవుతున్నాయి. కారణం ఏంటా అని ఆరా తీస్తే.. కంపెనీ ఇస్తున్న డీప్ డిస్కౌంట్స్ అని అర్థమవుతోంది. కొన్ని మోడళ్లపై పాతిక వేల నుంచి లక్షా పాతిక వేల వరకూ డిస్కౌంట్స్ ఇస్తోంది మారుతి. ఎందుకో చూద్దాం. 

బీఎస్ 6 దెబ్బ
త్వరలో భారత్ స్టాండర్డ్ ఎమిషన్స్ 6 నిబంధనలకు తగ్గట్టు ఆటోమొబైల్ కంపెనీలన్నీ వాహనాల తయారీని మార్చాల్సి ఉంది. అయితే మారుతి దగ్గర పేరుకుపోయిన నిల్వల నేపధ్యంలో వాటిని ఎలాగైనా వదిలించుకోవాలని డిస్కౌంట్లతోపాటు మరిన్ని ఆఫర్లను ఇస్తోంది. భారీ డిస్కౌంట్లతో పాటు వారెంటీని పొడిగించడం వల్ల కస్టమర్లు వీటి కోసం క్యూ కడ్తున్నారు. సంవత్సరాంతం అయినప్పటికీ ఈ రెండు మోడళ్ల కొనుగోళ్ల విషయంలో మాత్రం ఎక్కడా ఎఫెక్ట్ కనిపించడం లేదని తెలుస్తోంది. 
అంతే కాదు ఈ డిమాండ్ తట్టుకోవడానికి మరో నెల రోజుల పాటు బ్రిజా ఉత్పత్తిని జనవరిలో కూడా కొనసాగించబోతున్నారు. ఇప్పటివరకూ నవంబర్‌లో 4 వేలు, డిసెంబర్‌లో 12 వేల బ్రిజా కార్లను అదనంగా మ్యానుఫ్యాక్చర్ చేసింది మారుతి సుజుకి. ఇందుకోసం వెయ్యి మందిని అదనంగా తాత్కాలిక సిబ్బందిని కూడా నియమించుకుంది మారుతి సుజుకి. 

ఏ డీజిల్ కార్లకు డిమాండ్ 
డిస్కౌంట్ సహా ఎక్స్‌టెండెట్ వారెంటీ నేపధ్యంలో డీజిల్ బ్రిజా, డిజైర్ టూర్, న్యూ వాగన్ ఆర్‌ కొనుగోళ్లు పెరిగాయి. అందుకే ఇయర్ ఎండింగ్‌లో కూడా వెయిటింగ్ పీరియడ్ ఉండడం గమనించాల్సిన అంశం. 

కొత్త బ్రిజా పెట్రోల్ కార్
బీఎస్ 6 నిబంధనల నేపధ్యంలో కొత్త బ్రిజా పెట్రోల్ మోడల్‌ను మారుతి సుజుకి రూపొందిస్తోంది. ఒకప్పుడు ఇది డీజిల్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే వీటి ఉత్పత్తిని నిలిపేయబోతున్నట్టు గతంలో కంపెనీ చెప్పినప్పటికీ డిమాండ్ నేపధ్యంలో మరో నెల పాటు వీటిని ఉత్పత్తి చేయబోతోంది. 

చిన్న కార్లకు టయోటా చెక్
టయోటా ఇండియా భారత్‌లో ఇక నుంచి చిన్న డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేయాలని నిర్ణయించుకుంది. ఖర్చులు పెరిగిపోతున్న నేపధ్యంలో బీఎస్ 6 నిబంధనలకు తగ్గట్టు వాటిని రూపొందించడం కష్టమనే భావనకు వచ్చింది. ఇన్నోవా, ఫార్చూనర్ వాహనాలు మాత్రమే డీజిల్‌లో అందుబాటులో ఉంటాయి. 
అయితే 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగిన ఎటియోస్, ఎటియోస్ క్రాస్, లివా, కరోలా ఆల్టిస్ మాత్రం ఇకపై నిలిచిపోతున్నాయి. వీటి ఉత్పత్తిని పూర్తిగా ఆపేయబోతోంది టయోటా ఇండియా.