ఈక్విటీ మార్కెట్లపై ఇన్వెస్టర్ల చూపు - శాంతించిన బంగారం 

ఈక్విటీ మార్కెట్లపై ఇన్వెస్టర్ల చూపు - శాంతించిన బంగారం 

ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధర కొంత శాంతించింది. సెప్టెంబర్‌లో రికార్డు  స్థాయి గరిష్టానికి చేరిన గోల్డ్‌ గత రెండు నెలల్లో దాదాపు రూ.2వేలకు పైగా తగ్గింది. యూఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందంపై ఇన్వెస్టర్లు ఆశావాహ దృక్పథంతో ఉండటంతో బంగారం ధరలు నెమ్మదించాయి.

కొండెక్కిన బంగారం ధరలు క్రమక్రమంగా దిగివస్తున్నాయి. దీనికి అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలే ప్రధాన కారణం. సెప్టెంబర్‌ ప్రారంభంలో రికార్డు స్థాయిలో 40వేలు పలికిన 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 38వేల సమీపానికి వచ్చింది. సోమవారం బంగారం ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల ధర 10 గ్రాములకు 0.23 శాతం తగ్గి రూ.37,908 పలికింది. వెండి కాంట్రాక్టుల ధర కూడా 0.59 శాతం క్షీణించి రూ.44,181కి దిగివచ్చింది. గత 2 నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో బులియన్‌ మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనైంది. సెప్టెంబర్‌లో గ్లోబల్‌ మార్కెట్లో ఆరేళ్ల గరిష్టానికి పుత్తడి ఎగబాకింది. సెప్టెంబర్‌ తొలివారంలో 1550 డాలర్లకు పెరిగిన ఔన్స్‌ బంగారం ప్రస్తుతం 1463.70 వద్ద ట్రేడవుతోంది. 
 
యూఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశావహ దృక్పథం కారణంగా నవంబర్‌లోబంగారం, వెండి మార్కెట్లు నిస్తేజంగానే ఉన్నాయని మార్కెట్‌ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈక్విటీ మార్కెట్లు అప్‌ట్రెండ్‌లో ఉండటం, వాల్‌స్ట్రీట్‌ సరికొత్త గరిష్ఠ స్థాయిలు నమోదు చేసింది. దీంతో ఇన్వెస్టర్ల చూపు బంగారం నుంచి ఈక్విటీ మార్కెట్ల వైపు మళ్ళింది. ఔన్సు బంగారం ధర 1480 డాలర్లను బ్రేక్‌ చేస్తే తప్ప మరోసారి ర్యాలీకి ఆస్కారం లేదని మార్కెట్‌ విశేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఏదేమైనా అమెరికా, చైనా చర్చలు, బ్రెగ్జిట్‌ వంటి పరిణామాల ప్రభావం వల్ల మరికొన్ని రోజులు బులియన్‌ మార్కెట్‌ నిరాశావహంగానే ఉండవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. గత రెండు నెలల్లో బంగారం ధర భారీగా తగ్గినప్పటికీ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 14 శాతం వృద్ధి నమోదైంది. ఇదేకాలంలో భారత విపణిలో బంగారం  ధర 20 శాతం పెరిగింది.