విదేశీ మార్కెట్లపైనే దృష్టి

విదేశీ మార్కెట్లపైనే దృష్టి

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ ప్రధానంగా విదేశీ అంశాలపైనే ఆధారపడనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ రెండు దేశాల మధ్య ఏడాది కాలంగా కొనసాగుతున్న వాణిజ్య వివాదాల ఫలితంగా ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులు తలెత్తుతున్నట్లు పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల రెండు దేశాలూ పాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాణిజ్య వివాద పరిష్కార అంశాలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు కీలకంగా నిలవనున్నట్లు నిపుణులు వివరించారు. 

ఫెడ్‌ మినిట్స్‌ 
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ గత పాలసీ సమీక్ష వివరాలు(మినిట్స్‌) 21న విడుదలకానున్నాయి. అక్టోబర్‌లో సమావేశమైన ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ఈ ఏడాది వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్‌ ఫండ్స్ రేట్లు ప్రస్తుతం 1.5-1.75 శాతంగా అమలవుతున్నాయి. కాగా.. అక్టోబర్‌లో అమెరికా రిటైల్‌ సేల్స్‌ 0.3 శాతం వృద్ధిని చూపాయి. విశ్లేషకులు 0.2 శాతం పురోగతిని అంచనా వేశారు. నవంబర్‌ నెలకు తయారీ రంగ గణాంకాలు 22న వెల్లడికానున్నాయి. ఈ బాటలో అక్టోబర్‌ నెలకు జపనీస్‌ వాణిజ్య గణాంకాలు 20న, యూరోజోన్‌ కన్జూమర్ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ వివరాలు 21న వెల్లడికానున్నాయి. 

ఇతర అంశాలూ
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఫీఐలు) పెట్టుబడులు తదితర పలు అంశాలు మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రభావితం చేయగలవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.