పేజ్ జూమ్‌- గుజరాత్ ఫ్లోరో డీలా

పేజ్ జూమ్‌- గుజరాత్ ఫ్లోరో డీలా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఆకట్టుకోవడంతో జాకీ బ్రాండ్‌ ఇన్నర్‌వేర్‌ కంపెనీ పేజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ గుజరాత్‌ ఫ్లోరోకెమికల్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి పేజ్‌ ఇండస్ట్రీస్‌ లాభాలతో సందడి చేస్తుంటే.. గుజరాత్‌ ఫ్లోరోకెమికల్స్‌ నష్టాలతో కళతప్పింది. వివరాలు చూద్దాం..

పేజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ప్రయివేట్‌ రంగ సంస్థ పేజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నికర లాభం 24 శాతం ఎగసి రూ. 115 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12 శాతం పుంజుకుని రూ. 775 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం 4 శాతం పెరిగి రూ. 149 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు మాత్రం 20.7 శాతం నుంచి 19.2 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో పేజ్‌ ఇండస్ట్రీస్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3.5 శాతం జంప్‌చేసి రూ. 24,427 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 24,694 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

Image result for gujarat fluorochemicals ltd

గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్‌ లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ప్రయివేట్‌ రంగ కంపెనీ గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్‌ నికర లాభం 87 శాతం పడిపోయి రూ. 15 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 10 శాతం క్షీణించి రూ. 662 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 35 శాతం వెనకడుగుతో రూ. 124 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 25.7 శాతం నుంచి 18.7 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో గుజరాత్‌ ఫ్లోరో కెమికల్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం క్షీణించి రూ. 578 వద్ద ట్రేడవుతోంది.