చివర్లో జోరు- మెటల్‌ బోర్లా

చివర్లో జోరు- మెటల్‌ బోర్లా

మిశ్రమ ప్రపంచ సంకేతాల నడుమ ఒడిదొడుకులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్ నుంచీ జోరందుకున్నాయి. చివర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ 170 పాయింట్లు పెరిగి 40,286 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 32 పాయింట్లు పుంజుకుని 11,872 వద్ద నిలిచింది. దేశ ఔట్‌లుక్‌ను మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ ప్రతికూలానికి సవరించడంతోపాటు, ఐఐపీ నీరసించడంతో బుధవారం మార్కెట్లు పతనంతో ముగిసిన విషయం విదితమే. కాగా.. రిటైల్‌ ద్రవ్యోల్బణం 16 నెలల గరిష్టాన్ని తాకిన నేపథ్యంలో మరోసారి మార్కెట్లు హెచ్చుతగ్గుల నడమ కన్సాలిడేట్‌ అయినట్లు నిపుణులు పేర్కొన్నారు. మీడియా రంగ దిగ్గజం డిస్నీ అండతో బుధవారం అమెరికా స్టాక్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడం డోజోన్స్‌ సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. అయితే ఆసియా మార్కెట్లు అమ్మకాలతో కుదేలయ్యాయి. 

ఐటీ అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఆటో రంగాలు 1-0.5 శాతం మధ్య బలపడగా.. మెటల్‌ 2 శాతం క్షీణించింది. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 0.9-0.5 శాతం మధ్య నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మారుతీ, బజాజ్‌ ఫిన్‌, ఐషర్, హెచ్‌సీఎల్‌ టెక్‌, సిప్లా, టైటన్‌ 2.5-1 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌ 4 శాతం పతనంకాగా.. ఇండస్‌ఇండ్‌, జీ, వేదాంతా, హిందాల్కో, అల్ట్రాటెక్‌, కోల్‌ ఇండియా, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌ 3-1.4 శాతం మధ్య డీలాపడ్డాయి.   

ముత్తూట్‌ అప్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ముత్తూట్‌ ఫైనాన్స్ 9.4 శాతం దూసుకెళ్లగా.. సన్‌ టీవీ, చోళమండలం, సెంచురీ టెక్స్‌, కేడిలా హెల్త్‌కేర్‌, డీఎల్‌ఎఫ్‌, గ్లెన్‌మార్క్‌, ఇండిగో, అంబుజా సిమెంట్‌, మహానగర్ గ్యాస్‌ 4.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు ఐడియా 19 శాతం కుప్పకూలగా.. అరబిందో 8.5 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో ఎన్‌బీసీసీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, నాల్కో, టీవీఎస్‌ మోటార్, ఎన్‌సీసీ 5-3 శాతం మధ్య వెనకడుగు వేశాయి. 

మిడ్‌ క్యాప్స్‌ ఓకే 
మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలి చివర్లో జోరందుకున్న నేపథ్యంలో మధ్య, చిన్నతరహా కౌంటర్లు అటూఇటుగా ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.15 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1007 లాభపడగా.. 1504 నష్టాలతో నిలిచాయి. 

ఎఫ్‌పీఐల దన్ను
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 585 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 890 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం మార్కెట్లకు సెలవుకాగా.. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 664 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. డీఐఐలు రూ. 245 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే.