డిక్సన్‌ భళా.. వేదాంతా వీక్‌

డిక్సన్‌ భళా.. వేదాంతా వీక్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో వైట్‌గూడ్స్‌ కాంట్రాక్ట్‌ మ్యాన్యుఫాక్చరింగ్ దిగ్గజం డిక్సన్‌ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో ప్రకటించిన ఫలితాలు అంచనాలను చేరకపోవడంతో అనిల్‌ అగర్వాల్ గ్రూప్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి డిక్సన్‌ షేరు లాభాలతో సందడి చేస్తుంటే.. వేదాంతా నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం..

డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఇండియా నికర లాభం రెండున్నర రెట్లు ఎగసి రూ. 43 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 90 శాతం పెరిగి రూ. 1405 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 4.7 శాతం వద్దే నిలకడను చూపాయి. ఫలితాల నేపథ్యంలో డిక్సన్‌ టెక్నాలజీస్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 10 శాతం దూసుకెళ్లి రూ. 3305 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 3360 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. కంపెనీ ఇటీవల కొరియన్‌ దిగ్గజం శామ్‌సంగ్‌ నుంచి మొబైల్‌ తయారీ కాంట్రాక్టును సొంతం చేసుకోవడం విశేషం!

Image result for vedanta ltd

వేదాంతా లిమిటెడ్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో ప్రయివేట్‌ రంగ మెటల్‌ దిగ్గజం వేదాంతా లిమిటెడ్‌ నికర లాభం 61 శాతం పెరిగి రూ. 2158 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 3 శాతం క్షీణించి రూ. 21,958 కోట్లను తాకింది. నిర్వహణ లాభం 14 శాతం నీరసించి రూ. 4423 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 22.6 శాతం నుంచి 20.1 శాతానికి బలహీనపడ్డాయి. ప్రస్తుత క్యూ2లో రూ. 1891 కోట్ల డిఫర్డ్‌ ట్యాక్స్‌ లాభం ఆర్జించగా.. రూ. 422 కోట్లమేర అనుకోని నష్టం నమోదైంది. ఇతర ఆదాయం 49 శాతం పుంజుకుని రూ. 856 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా లిమిటెడ్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 3 శాతం క్షీణించి రూ. 144 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 143 దిగువన ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.