రూపా.. అశోకా బిల్డ్‌కాన్‌- జోరు

రూపా.. అశోకా బిల్డ్‌కాన్‌- జోరు

సొంత అనుబంధ సంస్థను ఏర్పాటు చేసుకునేందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లడించడంతో నిట్‌వేర్‌ తయారీ సంస్థ రూపా అండ్‌ కంపెనీ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో మౌలిక రంగ సదుపాయాల కంపెనీ అశోకా బిల్డ్‌కాన్‌ లిమిటెడ్‌  కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

రూపా అండ్‌ కంపెనీ
రూపా ఫ్యాషన్స్‌ లేదా ఏ ఇతర పేరుతో పూర్తిస్థాయి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసేందుకు బోర్డు అనుమతించినట్లు రూపా అండ్‌ కంపెనీ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. దీంతో అనుబంధ సంస్థ ఏర్పాటుతోపాటు.. పెట్టుబడులు పెట్టేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది. ఇన్నర్‌వేర్‌ దుస్తుల సంస్థ రూపా అండ్‌ కంపెనీలో ప్రమోటర్లకు 73.29% వాటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రూపా అండ్‌ కంపెనీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5.2 శాతం జంప్‌చేసి రూ. 186 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 197ను సైతం అధిగమించింది.

Image result for ashoka buildcon ltd

అశోకా బిల్డ్‌కాన్‌
ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్)లో ప్రయివేట్‌ రంగ కంపెనీ అశోకా బిల్డ్‌కాన్‌ లిమిటెడ్‌ రూ. 73 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 17 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం సైతం 10 శాతంపైగా పెరిగి రూ. 861 కోట్లను అధిగమించింది. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ2లో రూ. 11.5 కోట్ల నికర లాభం ఆర్జించగా.. గతేడాది(2018-19) క్యూ2లో రూ. 3.7 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 3 శాతం పుంజుకుని రూ. 1053 కోట్లను తాకింది. మౌలిక సదుపాయాల ఈ కంపెనీలో ప్రమోటర్లకు 54.26% వాటా ఉంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో అశోకా బిల్డ్‌కాన్‌ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 97 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 103 వరకూ ఎగసింది.